న్యూఢిల్లీ, అక్టోబర్ 24: చిన్న మదుపరులకు తాజాగా రిజర్వ్‌బ్యాంక్ తన పోర్టల్ ద్వారా మరో మదుపు సాధనంలో పెట్టుబడికి అనుమతి ఇచ్చింది. ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్లను (ఎఫ్ఆర్ఎస్బీలు) తమ రిటైల్ డైరెక్ట్ పోర్టల్ ద్వారా కొనుగోలు చేయవచ్చని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకూ రిటైల్ డైరెక్ట్ పోర్టల్ ద్వారా సావరిన్ గోల్డ్ బాండ్లు, కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్స్, రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను మాత్రమే రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడి చేసే వీలు ఉంది. ఇక నుంచి ఎఫ్ఆర్ఎస్బీ, 2020ల్లో (ట్యాక్స్‌బుల్) రూ.20,000 వరకూ పోర్టల్ ద్వారా మదుపు చేయవచ్చు.
ఎన్ఎస్సీ కంటే వడ్డీ అధికం
ఎఫ్ఆర్ఎస్బీలు కేంద్ర ప్రభుత్వం జారీచేసే నాన్-ట్రేడబుల్ బాండ్లు. ఈ బాండ్ల కాలపరిమితి ఏడేండ్లు. పోస్టాఫీసుల్లో జారీ అయ్యే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ) వడ్డీ రేటు కంటే ఎఫ్ఆర్ఎస్బీలపై 0.35 శాతం అదనంగా వడ్డీ లభిస్తుంది. ప్రస్తుతం ఎన్ఎస్సీపై వడ్డీ రేటు 8.05 శాతం. ఆర్బీఐ సేవింగ్స్ బాండ్లపై వడ్డీని ప్రతీ ఏడాది రెండు దఫాలుగా (జనవరి 1, జూలై 1) చెల్లిస్తారు. ఇవి నాన్-ట్రేడబుల్ బాండ్లు అయినందున వీటి నుంచి మధ్యలో వైదొలిగే అవకాశం లేదు. జారీ చేసిన తేదీ నుంచి ఏడేండ్లు పూర్తయిన తర్వాత బాండ్లలో పెట్టుబడి మొత్తాన్ని చెల్లిస్తారు.