Nomura | న్యూఢిల్లీ, జూలై 21: అధిక కూరగాయల ధరలతో దేశంలో వినిమయ ద్రవ్యోల్బణం పెరిగిపోతుందని ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నోమురా హెచ్చరించింది. జూలై, ఆగస్టు నెలల్లో ఇది రిజర్వ్‌బ్యాంక్ నిర్దేశిత గరిష్ఠస్థాయి 6 శాతాన్ని మించుతుందని అంచనా వేసింది. ధరల్ని అదుపుచేసేందుకు ఇప్పటికే నాన్-బాస్మతి బియ్యం ఎగుమతుల్ని నిషేధించిన కేంద్ర ప్రభుత్వం..దేశంలో సరఫరాల కొరత లేకుండా మరిన్ని చర్యలు చేపట్టవచ్చని శుక్రవారం నోమురా ఆర్థిక వేత్తలు వివరించారు. సరఫరావైపు చర్యలు కొనసాగినా, కూరగాయల ధరలు ఆకాశాన్నంటడంతో జూలై, ఆగస్టు నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతంపైనే ఉంటుందన్నారు.
2023 మే నెలలో 4.31 శాతం ఉన్న వినిమయ ద్రవ్యోల్బణం (సీపీఐ) జూన్‌లో 4.81 శాతానికి పెరిగింది. జూన్ నెలలో బియ్యం ధరలు 12 శాతం పెరిగాయని, జూలైలో ఇవి మరింత ఎగిసినట్టు రోజువారీ గణాంకాలు వెల్లడిస్తున్నాయని నోమురా తెలిపింది. రుతుపవనాలు జాప్యంకావడం, అటుతర్వాత అధిక వర్షపాతం కారణంగా వరినాట్లు నిరుడు జూలై మధ్యనాటితో పోలిస్తే ఈ ఏడాది 6 శాతం తగ్గాయని, ఇది ఎగుమతుల నిషేధానికి దారితీసిందని వివరించింది. 2023 నాల్గవ త్రైమాసికంలో వివిధ రాష్ర్టాల ఎన్నికలు, 2024 ద్వితీయ త్రైమాసికంలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో అధిక ద్రవ్యోల్బణం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంటుందని రేటింగ్ ఏజెన్సీ నోమురా తెలియజేసింది.