Stock Market | న్యూఢిల్లీ, అక్టోబర్ 2: ఆల్‌టైమ్ హై రికార్డుల్లో పరుగులు పెడుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు.. అదే స్థాయిలో మదుపరులకు లాభాలను తెచ్చిపెడుతున్నాయి. ఈ ఏడాది ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లపై కాసుల వర్షం కురిసింది మరి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) నమోదిత సంస్థల మార్కెట్ విలువ ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా రూ.110.57 లక్షల కోట్లు ఎగిసింది. గడిచిన 9 నెలల్లో నిరంతర మార్కెట్ ర్యాలీ.. మదుపరుల సంపదను రూ.110,57,617.40 కోట్లు పెంచి రూ.4,74,86,463.65 కోట్ల (5.67 ట్రిలియన్ డాలర్లు)కు చేర్చింది. గత నెల 27న మునుపెన్నడూ లేనివిధంగా రూ.477.93 లక్షల కోట్లను తాకడం గమనార్హం.
మూడు సూచీల్లోనూ..
బీఎస్ఈలో పెద్ద, మధ్య, చిన్న శ్రేణి సూచీలుగా చెప్పుకొనే సెన్సెక్స్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు ఈ ఏడాది దుమ్మురేపాయి. సెన్సెక్స్ 12,026.03 పాయింట్లు లేదా 16.64 శాతం ఎగబాకింది. ఈ ఏడాది ఆరంభంలో 72,271.94 వద్దే ఉండగా, ఇప్పుడు 84,266.29 వద్ద ఉన్నది. ఇక సెప్టెంబర్ 27నైతే ఆల్‌టైమ్ హై 85,978.25 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్ సైతం 12,645.24 పాయింట్లు లేదా 34.32 శాతం పుంజుకున్నది. స్మాల్‌క్యాప్ 14,777.09 పాయింట్లు లేదా 34.62 శాతం పెరిగింది. దీంతో ఓవరాల్‌గా బ్లూచిప్, మిడ్, స్మాల్‌క్యాప్ షేర్లలో పెట్టుబడులు పెట్టిన సగటు మదుపరికి ఈ ఏడాది లాభాలు దక్కాయనే చెప్పవచ్చు.
ఫిబ్రవరి 1 నుంచి..వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 మొదలు క్వాలిఫైడ్ స్టాక్ బ్రోకర్లు సైతం ఏఎస్బీఏ సౌకర్యం మాదిరే తమ క్లయింట్లకు యూపీఐ ఆధారిత బ్లాక్ మెకానిజంను వినియోగించి సెకండరీ మార్కెట్లో ట్రేడింగ్ సదుపాయాన్ని కల్పించాల్సి ఉంటుంది. లేదా 3 ఇన్ 1 ట్రేడింగ్ ఖాతా (సేవింగ్స్, డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్లు ఒకే అకౌంట్లో కలిసి ఉన్న) సదుపాయాన్నైనా ఇవ్వాల్సి ఉంటుంది. మదుపరుల సాధికారతే లక్ష్యంగా సెబీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. ఇదిలావుంటే మున్సిపల్ బాండ్ల సబ్‌స్ర్కైబర్స్ కోసం పన్ను ప్రోత్సాహకాలను తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సెబీ కోరింది. అప్పుడే డిమాండ్ బాగుంటుందని అభిప్రాయపడింది. మౌలికాభివృద్ధికి కావాల్సిన నిధుల కోసం ఈ బాండ్లను సర్కారు విక్రయిస్తున్న విషయం తెలిసిందే. మౌలిక రంగ ప్రాజెక్టుల కోసం బాండ్ల ద్వారా 1997 నుంచి మున్సిపాలిటీలు రూ.2,700 కోట్లను సమీకరించాయి.
ఈ ఏడాది దేశీయ స్టాక్ మార్కెట్లు ఇంతలా మదుపరులకు లాభాలను పంచిపెట్టడానికి కారణం మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలోకి భారీ ఎత్తున వచ్చిన పెట్టుబడులే. విదేశీ సంస్థాగత మదుపరుల (ఎఫ్ఐఐ) నుంచి అమ్మకాల ఒత్తిడి కొనసాగుతున్నా.. ఈక్విటీ మార్కెట్లు రికార్డు హైలను చేరుతూపోయాయి. దేశీయ మదుపరులు కొనుగోళ్లకు పెద్దపీట వేయడం ఇందుకు కలిసొచ్చింది. అలాగే మిడ్, స్మాల్‌క్యాప్ సూచీల్లో పెట్టుబడులు రిటైల్ ఇన్వెస్టర్లకు లాభించాయి. మొత్తంగా చూసినైట్టెతే ఈ 2024 సంవత్సరం భారతీయ స్టాక్ మార్కెట్లలో ఎప్పుడూలేని ఉత్సాహాన్ని నింపింది.
-సంతోష్ మీనా, స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ రిసెర్చ్ హెడ్
గడిచిన కొద్దివారాలుగా భారతీయ స్టాక్ మార్కెట్లలో జరుగుతున్న ర్యాలీ.. అమెరికా ఫెడ్ రిజర్వ్ తగ్గించిన వడ్డీరేట్లు, రాబోయే ద్రవ్యసమీక్షల్లోనైనా ఆర్బీఐ వడ్డీరేట్లకు కోత పెడుతుందన్న ఆశలతోనేనని చెప్పవచ్చు. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలున్నా అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో నడుస్తుండటం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్మెంట్ సెంటిమెంట్‌ను పెంచింది. గత నెల కేవలం వారం రోజుల్లోనే సెన్సెక్స్ 2వేల పాయింట్లు పెరగడం మార్కెట్లో కొనుగోళ్ల ఉత్సాహానికి నిదర్శనంగా నిలుస్తున్నది.
-ప్రశాంత్ తాప్సీ, మెహెతా ఈక్విటీస్ లిమిటెడ్ సీనియర్ వీపీ
బీఎస్ఈలో టాప్-5 కంపెనీలుమార్కెట్ విలువ (రూ.కోట్లలో)