దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కదలాడుతున్నాయి. మునుపటి వారం ముగింపుతో చూస్తే గత వారం సెన్సెక్స్ 709.19 పాయింట్లు ఎగిసి 81,306.85 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 238.80 పాయింట్లు ఎగబాకి 24,870.10 వద్ద నిలిచింది. అంతకుముందు వారం కూడా సూచీలు లాభాల్లోనే స్థిరపడ్డాయి. ఈ నేపథ్యంలో వరుస లాభాల నడుమ మదుపరులు లాభాల స్వీకరణకు పెద్దపీట వేయవచ్చన్న అంచనాలైతే ఉన్నాయి. పైగా ఈ వారం ఎఫ్‌అండ్‌వో ఎక్స్పైరీ తేదీలు ఉండటం కూడా మదుపరుల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయనున్నాయి.
ఇక డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, విదేశీ మదుపరుల పెట్టుబడులు ముఖ్యం. కొత్తగా రాబోయే ట్రంప్ టారిఫ్‌లూ కీలకమే. అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 24,500 పాయింట్ల స్థాయి కీలకం. దీనికి దిగువన ముగిస్తే 24,300 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లను తగ్గిస్తామన్న సంకేతాలను ఇస్తున్నది. దీంతో సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 25,200-25,400 స్థాయికి వెళ్లవచ్చు.
గమనిక..: స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్‌ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదొడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.