హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 26, (నమస్తే తెలంగాణ): ‘స్కల్ బేస్ ఎండోస్కోపీ’ అనే అంశంపై సికింద్రాబాద్లోని యశోద దవాఖానలో అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు శనివారం తొలి రోజు రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్ చోంగ్తూ ముఖ్యఅథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యశోదాలో ఏర్పాటు చేసిన అధునాతన రోబోటిక్ న్యూరోసర్జరీ, న్యూరో ఎండోస్కోపీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఆమె ప్రారంభించారు.
అనంతరం డాక్టర్ క్రిస్టినా జడ్ చోంగ్తూ మాట్లాడుతూ.. బ్రెయిన్ ట్యూమర్ చికిత్సల కోసం న్యూరోఎండోస్కోపిక్ సర్జరీలు ఎంతో ప్రయోజనకరంగా మారాయని, మినిమమ్ ఇన్వేసివ్ పద్ధతుల వల్ల రోగులు త్వరగా కోలుకుంటున్నారని తెలిపారు. పుర్రెకు సంబంధించిన వ్యాధులు, లోతైన బ్రెయిన్ ట్యూమర్లు, హైడ్రోసెఫలస్ లాంటి సమస్యలకు న్యూరో ఎండోస్కోపీ ద్వారా సురక్షిత పరిష్కారాలు లభిస్తున్నాయని సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ అయ్యాదురై వివరించారు.
యశోదా హాస్పిటల్స్ గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి మాట్లాడుతూ.. భారత్లో తొలిసారి ట్రాన్స్ ఆర్బిటల్ స్కల్ బేస్ సర్జరీని ప్రదర్శించడం తమకు ఎంతో గర్వకారణమని చెప్పారు. కార్యక్రమంలో యశోదా హాస్పిటల్స్ యూనిట్ హెడ్ డాక్టర్ విజయ్ కుమార్, న్యూరాలాజీ, న్యూరోసర్జరీ విభాగాల వైద్యులతోపాటు దేశ, విదేశాలకు చెందిన 500 మందికిపైగా న్యూరోసర్జన్లు, న్యూరాలజిస్టులు పాల్గొన్నారు.