Union Budget | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ఎనిమిదో వార్షిక యూనియన్ బడ్జెట్‌ను ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశ పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వేతన జీవుల నుంచి కార్పొరేట్ సంస్థలు.. వివిధ రంగాలు బెనిఫిట్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ప్రత్యేకించి వేతన జీవులపై ఆదాయం పన్ను రేట్లలో స్టాండర్డ్ డిడక్షన్ పెంపుపై ఆశల ఊసులు పెరుగుతున్నాయి. 2025-26 బడ్జెట్ వల్ల దేశ ప్రజలపై పడే ప్రభావం ఎంత అన్నదానిపై దృష్టి కేంద్రీకరించారు. భారత ఆర్థిక వ్యవస్థలో కేంద్ర బడ్జెట్లు కీలక పాత్ర పోషిస్తుంది. ఫ్రాన్స్ బౌగెట్ (bougette) నుంచి బడ్జెట్ పదం వచ్చింది. నిధుల కేటాయింపులకు సింబాలిక్‌గా బౌగెట్ అంటే చిన్న బ్యాగ్/ పౌంచ్ అని అర్ధం. భారత బడ్జెట్ చరిత్రలో సంప్రదాయాలు, ఆసక్తికర అంశాలు తెలుసుకుందామా..!
భారత బడ్జెట్ ప్రయాణం బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో 1860లో ప్రారంభమైంది. నాడు భారత్ తొలి బడ్జెట్ ప్రవేశ పెట్టిన జేమ్స్ విల్సన్ అనే స్కాటిష్ ఆర్థిక వేత్త భారత్ ఆర్థిక సుపరిపాలనకు పునాదులు వేశారు. తర్వాత ఆయన ది ఎకనమిస్ట్ మ్యాగజైన్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ స్థాపించారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆర్కే షణ్ముఖం చెట్టి 1948 ఫిబ్రవరి 28 తొలి యూనియన్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. అంతకు ముందు 1947 నవంబర్ 26న కొత్తగా స్వాతంత్య్రం వచ్చిన భారత్‌లో నాలుగు నెలల ఆర్థిక లావాదేవీల నిర్వహణకు ఇంటరిం బడ్జెట్ సమర్పించారు.
కేంద్ర బడ్జెట్‌ను కొందరు ప్రధానులు కూడా సమర్పించారు. 1958లో తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, 1970లో ఇందిరాగాంధీ, 1987లో రాజీవ్ గాంధీ ప్రధాని హోదాలో బడ్జెట్ సమర్పించారు. అత్యధికంగా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ పది బడ్జెట్లు ప్రవేశ పెడితే, పీ చిదంబరం తొమ్మిది బడ్జెట్లను పార్లమెంట్‌కు సమర్పించారు.
ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమర్పణలో సొంత మైలురాళ్లు నమోదు చేశారు. 2020లో సుదీర్ఘంగా 2.42 గంటలు బడ్జెట్ స్పీచ్‌తో రికార్డు నెలకొల్పారు. 2021లో తొలిసారి పూర్తిగా పేపర్‌లెస్ బడ్జెట్ సమర్పించారు.
వలసవాద పద్దతులకు అనుగుణంగా బ్రిటన్ పార్లమెంట్ షెడ్యూల్ ఉంటుంది. దీంతో కేంద్ర బడ్జెట్లు సాధారణంగా సాయంత్రం ఐదు గంటలకు ప్రవేశ పెట్టే వారు. కానీ, 1999లో అప్పటి కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా.. భారతీయులందరికి బడ్జెట్ చూసే అవకాశం కోసం ఉదయం 11 గంటలకు మార్చేశారు. యశ్వంత్ సిన్హా 2000లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ‘మిలీనియం బడ్జెట్’గా ప్రసిద్ధి చెందింది. అంతర్జాతీయ రంగంలో భారత ఐటీ రంగానికి ప్రముఖ స్థానం కల్పించిన బడ్జెట్ ఇదే.
కేంద్ర బడ్జెట్లో 2017లో గణనీయ మార్పులు చేశారు. ఫిబ్రవరి 28 నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీకి బడ్జెట్ సమర్పణ తేదీ మార్చారు. తద్వారా ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయ్యే ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి సమయానుకూలంగా నిధుల కేటాయింపునకు వీలుగా బడ్జెట్ తేదీ మార్చేశారు. అదే ఏడాది సాధారణ బడ్జెట్లో రైల్వే బడ్జెట్‌ను విలీనం చేశారు.
దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు మన్మోహన్ సింగ్. 1991లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లైసెన్స్ రాజ్‌కు తిలోదకాలిచ్చింది.భారత్ మార్కెట్లోకి గ్లోబల్ మార్కెట్లను అనుమతించారు. అలాగే యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఆర్థిక మంత్రి పీ చిదంబరం 1997-98లో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌కు ‘డ్రీమ్ బడ్జెట్’ అని పేరొచ్చింది. వ్యక్తిగత ఆదాయం పన్ను రేట్లలో కోత విధిస్తూ చిదంబరం కీలక నిర్ణయం తీసుకున్నారు. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ పునర్జీవనానికి బాటలు వేశారు.
కేంద్ర బడ్జెట్‌కు సంప్రదాయాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి హాల్వా తయారీ వేడుక. కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్లో బడ్జెట్ సమర్పించడానికి వారం ముందు హాల్వా వేడుక నిర్వహిస్తారు. దీంతో బడ్జెట్ ముద్రణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అప్పటి నుంచి అధికారులంతా గోప్యత కోసం నార్త్ బ్లాక్‌లోనే లాక్ఇన్ అవుతారు.
1950ల్లోనే బడ్జెట్ సీక్రెసీకి ప్రాధాన్యం వచ్చింది. అదే ఏడాది బడ్జెట్ లీక్ కావడంతో బడ్జెట్ ముద్రణను మింట్ రోడ్‌లోని డెడికేటెడ్ ప్రెస్‌కు మార్చేసింది కేంద్రం. 1980లో ఆర్థికశాఖ కార్యాలయం గల నార్త్‌బ్లాక్‌లో ప్రెస్ ఏర్పాటు చేసి భద్రత మరింత కట్టుదిట్టం చేశారు.