ముంబై, ఫిబ్రవరి 6: కీలక వడ్డీరేట్లు మరోసారి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో మూడు రోజుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం సోమవారం మొదలైంది. బుధవారం ఫలితం రానున్నది. అయితే ఈసారి ద్రవ్యసమీక్షలో రెపోరేటును ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్లు (పావు శాతం) పెంచే వీలుందన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా గత ఏడాది మే నెల నుంచి ఆర్బీఐ రెపోరేటును పెంచుతూపోతున్న విషయం తెలిసిందే.
అంతకుముందు కరోనా దెబ్బతో దిగాలుపడిన దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు తగ్గించిన సంగతీ విదితమే. కాగా, గడిచిన ఈ 9 నెలల్లో జరిగిన పెంపులతో ఇప్పుడు రెపోరేటు 6.25 శాతానికి చేరింది. ఈ క్రమంలో 6.5 శాతానికి వెళ్లే వీలుందని చెప్తున్నారు. ఇటీవలి ద్రవ్యసమీక్షలో అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచినది విదితమే. దీంతో ఈసారి తప్పక వడ్డింపులుంటాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
విరామం ఇస్తారా..
మరోవైపు ఈసారి వడ్డీరేట్ల పెంపునకు ఆర్బీఐ విరామం ఇచ్చే అవకాశం కూడా ఉందన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఆర్బీఐ లక్ష్యానికి దిగువనే రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం వద్ద ఉండటంతో ఈసారి వడ్డింపులు ఉండకపోవచ్చనే వారు చెప్తున్నారు. పైగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను వృద్ధిరేటు మందగిస్తుందన్న అంచనాలూ ఉండటంతో ఆర్బీఐ జీడీపీకి ఊతమిచ్చేందుకైనా ఈ దఫా వడ్డీరేట్ల పెంపునకు బ్రేక్ వేయవచ్చని విశ్లేషిస్తున్నారు. ఎస్బీఐ ఎకనామిక్ రిసెర్చ్ విభాగం ఇదే చెప్తున్నది. మరికొందరు మాత్రం ఇదే కారణంతో పెంపును 25 బేసిస్ పాయింట్లకు పరిమితం చేస్తుందంటున్నారు. అంతకంటే ఎక్కువ పెంచకపోవచ్చని చెప్తున్నారు. చివరిసారిగా నిరుడు డిసెంబర్లో జరిపిన ద్రవ్యసమీక్షలో రెపోరేటును ఆర్బీఐ 35 బేసిస్ పాయింట్లు పెంచినది తెలిసిందే.