కొత్త ఏడాదిలో ఐపీవోకు ఎల్ఐసీ
అమ్మకానికి జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ
న్యూఢిల్లీ, డిసెంబర్ 30: కొత్త ఏడాదిలో ప్రభుత్వ బీమా సంస్థలు.. ప్రైవేట్ బాట పట్టనున్నాయి. ఓ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని పూర్తిగా అమ్మేయాలని చూస్తున్న కేంద్రం.. ఇందుకోసం జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ (నేషనలైజేషన్) సవరణ చట్టం-2021నూ తీసుకొచ్చింది. ఇక ఐపీవో ద్వారా ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీలో వాటాను సొమ్ము చేసుకోవాలనీ మోదీ సర్కారు చూస్తున్నది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2021-22)గాను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది వాటిని అమలు చేసే దిశగా అడుగులు పడబోతున్నాయి. కరోనా వైరస్‌తో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దేశ ఆర్థిక వ్యవస్థపై మళ్లీ మందగమనం నీడలు కమ్ముకుంటున్నా.. ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గడం లేదు.
నాలుగు సంస్థల్లో..
ప్రస్తుతం నాలుగు ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలున్నాయి. అవి నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. వీటిలో ఒకదాన్ని అమ్మేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ.1.75 లక్షల కోట్ల నిధులను సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో ఎల్ఐసీలో 10 శాతం వాటా అమ్మకంతోనే లక్ష కోట్లు సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ కోసం ఎల్ఐసీ చట్టం-1956లో దాదాపు 27 సవరణలు చేశారు. దీని ప్రకారం ఐపీవో తర్వాత తొలి ఐదేండ్ల వరకు సంస్థలో కనీసం ప్రభుత్వానికి 75 శాతం వాటానైనా ఉండాలి. ఆ తర్వాత దాన్ని 51 శాతానికి తగ్గించుకోవచ్చు. ఎల్ఐసీ విలువను రూ.8-10 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు.