IRDAI | హైదరాబాద్, ఏప్రిల్ 3: పాలసీదారులకు ఓ బ్యాడ్ న్యూస్. భారతీయ బీమా రంగ నియంత్రిత, అభివృద్ధి ప్రాధికార సంస్థ ఐఆర్డీఏఐ.. సంప్రదాయ ఎండోమెంట్ కాంట్రాక్టులుసహా నాన్-లింక్డ్ లేదా లింక్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ కోసం గత ఏడాది డిసెంబర్లో తెచ్చిన డ్రాఫ్ట్‌ను పక్కన పెట్టింది. నిర్ణీత గడువుకు ముందే పాలసీలను సరెండర్ చేసేవారికి అధిక మొత్తంలో చెల్లించాలన్న దానికి ఈ డ్రాఫ్ట్ మద్దతిస్తున్నది. అయితే దీన్ని కాదని బీమా సంస్థల డిమాండ్లకు అనుగుణంగా ఐఆర్డీఏఐ తమ తుది నిబంధనల్ని విడుదల చేసింది. ప్రస్తుతమున్న చార్జీలనే యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఈ నెల 1 నుంచే అమల్లోకి వచ్చిన ఈ చార్జీలు.. బీమా కంపెనీలకే లాభం తెచ్చేలా ఉన్నాయి.
సరెండర్ వాల్యూ శ్లాబులు ఇలా..
బీమా సంస్థలు తమ పాలసీదారులకు ఇస్తున్న సరెండర్ వాల్యూను పెంచాలని 2023 డిసెంబర్ నాటి ముసాయిదాలో ఐఆర్డీఏఐ సిఫార్సు చేసింది. దీంతో పాలసీదారులు పాలసీ గడువు పూర్తయ్యేదాకా ఉండబోరని, ముందే పాలసీలను ఉపసంహరించుకుంటారన్న ఆందోళన పరిశ్రమ నుంచి వ్యక్తమైంది. అసెట్ లయబిలిటీ మేనేజ్మెంట్ ఇబ్బందులు, ఇతరత్రా సమస్యలూ వస్తాయని ఆ డ్రాఫ్ట్‌ను బీమా కంపెనీలు వ్యతిరేకించాయి. ఈ క్రమంలోనే ఆ డ్రాఫ్ట్‌ను కాదని, ఐఆర్డీఏఐ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది.
ఓ పాలసీ కోసం పాలసీదారుడు ఏటా లక్ష రూపాయల ప్రీమియంను చెల్లిస్తున్నాడనుకుందాం. రెండేండ్ల తర్వాత అతను ఆ పాలసీని సరెండర్ చేయాలన్న నిర్ణయానికి వస్తే.. అప్పుడు అతను చెల్లించిన ప్రీమియంలలో 30 శాతాన్ని మాత్రమే తిరిగి పొందగలడు. అంటే.. 2 వార్షిక ప్రీమియంలు రూ.2 లక్షలు. కాబట్టి రూ.60 వేలే దక్కుతాయి. దీంతో పాలసీ తీసుకున్నాక గడువు లోపలే దాన్నుంచి బయటకు రావాలనుకునేవారికి చాలా నష్టమే. నిజానికి నిరుడు డిసెంబర్ డ్రాఫ్ట్‌లో ఐఆర్డీఏఐ ప్రతిపాదననుబట్టి రెండేండ్ల తర్వాత లక్ష రూపాయల వార్షిక ప్రీమియం కలిగిన పాలసీని సరెండర్ చేస్తే.. సదరు పాలసీదారునికి రూ.1.65 లక్షలు వస్తున్నది.