న్యూఢిల్లీ : ఇన్స్టాగ్రాం (Instagram) తన యూజర్లకు క్రేజీ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువస్తుందనే ప్రచారం ఊపందుకుంది. యూజర్లు తమ సొంత ఏఐ చాట్‌బాట్స్‌ను క్రియేట్ చేసుకునే వెసులుబాటు కల్పించేందుకు సోషల్ మీడియా దిగ్గజం సంసిద్ధమైంది. ఈ ఏఐ చాట్‌బాట్స్ పర్సనలైజ్డ్గా పనిచేస్తాయి. ఇన్స్టాగ్రాం మాతృసంస్ధ మెటా ఇప్పటికే తన ఏఐ అసిస్టెంట్‌ను లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. అసలు మీకు అన్ని వేళల్లో పర్సనల్ అసిస్టెంట్ అందుబాటులో ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి..ఆ ఊహలను నిజం చేస్తూ ఇన్స్టాగ్రాం తన యూజర్లకు పర్సనలైజ్డ్ ఏఐ చాట్‌బాట్‌ను క్రియేట్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది.
ఈ వినూత్న ఫీచర్ అందుబాటులోకి వస్తే సోషల్ మీడియాను ప్రస్తుతం మనం వాడుతున్న తీరు పూర్తిగా మారిపోతుంది. యూజర్లు సొంతంగా పర్సనలైజ్డ్ ఏఐ చాట్‌బాట్స్‌ను క్రియేట్ చేసుకునేలా ఇన్స్టాగ్రాం ఓ అద్భుత ఫీచర్‌పై కసరత్తు సాగిస్తోంది. టెక్‌క్రంచ్ కధనం ప్రకారం ఇన్స్టాగ్రాం ప్రవేశపెట్టనున్న ఈ ఫీచర్ చాట్బాట్ల జెండర్, వయసు, జాతి, వ్యక్తిత్వం, ఆసక్తులను వ్యక్తిగతీకరించడానికి వినియోగదారులకు వెసులుబాటు కల్పిస్తుంది. చాట్బాట్లను సహచరులుగా కూడా ఉపయోగించవచ్చు. ఈ చాట్‌బాట్ యూజర్లకు సాయం అందించడం, మార్గదర్శకత్వం చేయడంతో పాటు చివరికి ఇవి యూజర్లకు వినూత్న ఐడియాలనూ అందించేందుకు ఉపకరిస్తాయి.
చాట్‌బాట్‌ను క్రియేట్ చేసిన అనంతరం యూజర్లు దానికి పేరు పెట్టడంతో పాటు చాట్ విండో ద్వారా దానితో చాట్ చేయవచ్చు. ఉదాహరణకు ఓ యూజర్ ఫ్యాషన్ నిపుణులైన చాట్‌బాట్‌ను క్రియేట్ చేస్తే ఆపై యూజర్ రాబోయే ఈవెంట్లో తాను ఏం ధరించాలనే ఐడియాను చాట్‌బాట్ నుంచి సలహా కోరవచ్చు. లైఫ్ కోచ్ చాట్చాట్ను క్రియేట్ చేస్తే లక్ష్యాలను నిర్ధేశించుకోవడం, సవాళ్లను అధిగమించడం గురించి దాని నుంచి యూజర్ సలహాలు కోరవచ్చు. మొత్తానికి పర్సనలైజ్డ్ ఏఐ చాట్‌బాట్స్ ఫీచర్‌ను ఇన్స్టాగ్రాం అందుబాటులోకి తీసుకువస్తే సోషల్ మీడియాలో అది పెను సంచలనానికి కేంద్ర బిందువు కానుంది.
Read More :
Delhi Pollution | రాజధానిలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం.. రెండు రోజులు స్కూళ్లు బంద్