న్యూఢిల్లీ, డిసెంబర్ 24 : ఈ ఏడాది భారతీయ స్టార్టప్‌లకు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)లు కలిసొచ్చాయి. దీంతో చాలాకాలం తర్వాత మళ్లీ 2025లో స్టార్టప్‌లలోకి నిధులు పోటెత్తినైట్టెంది. లెన్స్‌కార్ట్, గ్రో, మీషో, ఫిజిక్స్‌వాలా తదితర 18 స్టార్టప్‌లు దేశీయ స్టాక్ ఎక్సేంజీల్లో నమోదయ్యాయి మరి. ఈ క్రమంలో రూ.41,000 కోట్లకుపైగా నిధులను ఈక్విటీ మార్కెట్ మదుపరుల నుంచి సమీకరించాయి. 2024లో రూ.29,000 కోట్లే. అయితే ఈ ఏడాది దేశీయ టెక్ స్టార్టప్‌లు 10.5 బిలియన్ డాలర్ల నిధులనే అందుకున్నాయి. గత ఏడాది 12.7 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
2023లోనూ 11 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని మార్కెట్‌ను సమీక్షించిన ట్రాక్సన్ తెలిపింది. అలాగే 100 మిలియన్ డాలర్లకుపైగా ఉండే ఫండింగ్ రౌండ్లూ 14కు పడిపోయాయి. గత ఏడాది 19 జరిగాయి. ఈ ఏడాది ఇరిషా ఈ మొబలిటీ (1 బిలియన్ డాలర్లు), జెప్టో (450 మిలియన్ డాలర్లు), గ్రీన్‌లైన్ (275 మిలియన్ డాలర్లు) వంటి భారీ డీల్స్ ఉన్నా ఫలితం లేకపోయింది. ‘2025 బ్లాక్‌బస్టర్ ఐపీవోలకు నెలవైంది. వెంచర్ క్యాపిటల్ (వీసీ), ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) దన్ను కలిగిన కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు వచ్చాయి’ అని ట్రాక్సన్ సహ వ్యవస్థాపకురాలు నేహా సింగ్ పీటీఐకి తెలిపారు.