న్యూఢిల్లీ, జనవరి 14 : దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాలకు నూతన కార్మిక చట్టాల సెగ గట్టిగానే తాకింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను సంస్థ రూ.6,654 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.6,806 కోట్ల లాభంతో పోలిస్తే 2.2 శాతం క్షీణించింది. నూతన కార్మిక చట్టాలను అమలులోకి తీసుకురావడానికి సంస్థ ఒకేసారి రూ.1,289 కోట్ల నిధులను వెచ్చించాల్సి వచ్చిందని, దీంతో లాభాలపై ప్రతికూల ప్రభావం చూపిందని కంపెనీ సీఈవో, ఎండీ సలీల్ పరేఖ్ తెలిపారు.
సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 8.9 శాతం ఎగబాకి రూ.45,479 కోట్లకు చేరుకున్నది. గతేడాది ఇది రూ.41,764 కోట్లుగా ఉన్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయంలో 3-3.5 శాతం వృద్ధి నమోదుకానున్నదని గైడెన్స్లో వెల్లడించింది. ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన కార్మిక చట్టాలకు అనుగుణంగా ఒకేసారి 143 మిలియన్ డాలర్లు(రూ.1,289 కోట్లు) నిధులు వెచ్చించడంతో సంస్థపై భారం పడిందని బీఎస్ఈకి సమాచారం అందించింది. మరోవైపు, రెండో త్రైమాసికంలో నమోదైన లాభంతో పోలిస్తే మూడో క్వార్టర్లో 9.6 శాతం తగ్గింది. ఆదాయం మాత్రం 2.2 శాతం వృద్ధి నమోదైంది.