Infosys | బెంగళూరు, జనవరి 16: దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ విశ్లేషకుల అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక లాభంలో 11.46 శాతం వృద్ధి నమోదైందని పేర్కొంది. ఐటీ సేవలకు డిమాండ్ ఊపందుకోవడం, వార్షిక విక్రయాల అంచనా మూడోసారి పెంచడం సంస్థకు కలిసొచ్చింది.
అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికిగాను సంస్థ రూ.6806 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.6,106 కోట్ల లాభంతో పోలిస్తే రెండంకెల వృద్ధిని సాధించింది. అలాగే ఆదాయం ఏడాది ప్రాతిపదికన 7.6 శాతం అధికమై రూ.41,764 కోట్లుగా నమోదైంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఆదాయంలో 4.5-5 శాతం వరకు పెరుగుదలవుండవచ్చునని గైడెన్స్లో పేర్కొంది. ఈ సందర్భంగా కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సలీల్ పరేఖ్ మాట్లాడుతూ..ఆర్థిక సేవలతోపాటు రిటైల్, కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ రంగంలో మార్పులు అధికంగా చోటు చేసుకుంటున్నాయని, దీంతో ఈ ఏడాది ఆదాయ వృద్ధిలో అంచనాను సవరించినట్లు చెప్పారు. కంపెనీ మొత్తం ఆదాయంలో బీఎఫ్ఎస్ఐ నుంచి మూడోవంతు సమకూరుతున్నదని, అత్యధికంగా సమకూరుతున్న అమెరికాలో 6.1 శాతం వృద్ధిని కనబరిచినట్లు చెప్పారు.