న్యూఢిల్లీ, అక్టోబర్ 12: దేశీయ రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలకు తగ్గట్టుగానే రాణించింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికిగాను సంస్థ రూ.6,215 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.6,026 కోట్ల లాభంతో పోలిస్తే 3.1 శాతం వృద్ధి నమోదైంది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 6.7 శాతం ఎగబాకి రూ.38,994 కోట్లకు చేరుకున్నట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది. అనిశ్చిత ఆర్థిక పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఒప్పందాలు భారీగా కుదుర్చుకున్నట్టు, ముఖ్యంగా క్లయింట్లకు నూతన సేవలు అందించడం వల్లనే ఇది సాధ్యమైందన్నారు.
గైడెన్స్ నిరాశాజనకం..
ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించిన సంస్థ..ఆదాయ వృద్ధి అంచనాల్లో కోత విధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఆదాయంలో వృద్ధి 1-2.5 శాతం మాత్రమే నమోదుకానున్నదని గైడెన్స్‌లో పేర్కొంది. గతంలో 1-3.5 శాతంగా ఉంటుందని అంచనావేసిన విషయం తెలిసిందే. అలాగే ఆపరేటింగ్ మార్జిన్ గైడెన్స్ 20-22 శాతం మధ్యలో నమోదుకానున్నది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతుండటం, విచక్షణ ఖర్చులపై నియంత్రణ పాటిస్తుండటంతో గైడెన్స్‌లో కోత విధించినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
ఉద్యోగులకు శుభవార్త
ఉద్యోగులకు శుభవార్తను అందించింది ఇన్ఫోసిస్. వచ్చే నెల 1 నుంచి వేతనాలు పెంచుతున్నట్టు తాజాగా ప్రకటించింది. మరోవైపు ఇన్ఫీ ఉద్యోగుల సంఖ్య క్రమంగా పడిపోతున్నది. సెప్టెంబర్ చివరినాటికి 7,530 తగ్గి 3,28,764కి పడిపోయారు. జూన్ త్రైమాసికం నాటికి 3,36,294 మంది ఉన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ 50 వేల మంది ఫ్రెషర్లను నియమించుకున్నది. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రూ.5 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.18 మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. ఈ డివిడెండ్‌ను నవంబర్ 6న చెల్లింపులు జరపనున్నట్టు ప్రకటించింది.
గత త్రైమాసికంలో 7.7 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్నాం. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా అనవసరపు ఖర్చులు తగ్గించుకోవడానికి అధిక
ప్రాధాన్యతనిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది ఆదాయ వృద్ధి అంచనాల్లో కోత విధించడం జరిగింది. టెలికం, హై-టెక్, ఆర్థిక సేవలు(పేమెంట్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్), రిటైల్ వంటి రంగాలు బలహీనంగా ఉండటంతో ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపనున్నది.
– సలీల్ పరేఖ్, ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ