Infosys | దేశంలోకెల్లా రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఇంకా తమ ఉద్యోగులందరికీ ‘వర్క్ ఫ్రం ఆఫీస్’ తప్పనిసరి చేయలేదు. కనీసం కొద్ది మంది ఉద్యోగులతో ‘హైబ్రీడ్ వర్కింగ్ పాలసీ’ అమలు చేయాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. ‘వర్క్ ఫ్రం ఆఫీస్ లేదా వర్క్ ఫ్రం హోం’ విషయమై ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ ఆప్షన్లు కల్పిస్తున్నది.
కానీ తమ క్లయింట్లలో కొంత మంది వారి ప్రాజెక్టులను ఆఫీసు నుంచి నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారని ఇన్ఫోసిస్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు చెప్పారు. ఈ సమావేశంలో ఇన్పోసిస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నందన్ నిలేకని కూడా మాట్లాడారు.
వాటాదారుల ప్రశ్నలపై ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ స్పందించారు. భవిష్యత్ లో పరస్పరం అవసరాలకు అనుగుణంగా కనెక్ట్ కావడానికి, శిక్షణతోపాటు కొత్త విషయాలు తెలుసుకోవడానికి సోషల్ క్యాపిటల్ అవసరం అని చెప్పారు. ఇన్పీ సీఎఫ్ఓ నిలంజన్ రాయ్ కూడా పరేఖ్ వ్యాఖ్యలకు మద్దతు పలికారు. క్లయింట్ల డిమాండ్లకు, అవసరాలకు అనుగుణంగా కొద్ది మంది సిబ్బంది ఉద్యోగులు పని చేయడానికి ఆఫీసుకు రావాల్సి ఉంటుందన్నారు.