న్యూఢిల్లీ, డిసెంబర్ 24: కొవిడ్-19 నేపథ్యంలో డిజిటలైజేషన్‌కు డిమాండ్ భారీగా పెరగడంతో దేశంలోని స్టార్టప్‌లకు ప్రస్తుత ఏడాది వెంచర్ ఫండ్స్ నుంచి నిధులు వెల్లువెత్తాయి. 2021లో ఇప్పటివరకూ భారత స్టార్టప్‌లు రికార్డుస్థాయిలో 36 బిలియన్ డాలర్ల్ల (రూ.2,70,000 కోట్లు) పెట్టుబడులు సంపాదించాయని యూకేకు చెందిన ఇన్వెస్ట్మెంట్ డాటా ప్లాట్‌ఫామ్ ప్రిక్విన్ వెల్లడించింది. 2020లో ఇవి సమీకరించిన 11 బిలియన్ డాలర్లకంటే ప్రస్తుత ఏడాది మూడు రెట్లు పెరిగాయన్నది. 2021 డిసెంబర్ 20నాటికి సమీకరించిన మొత్తంలో 396 సీడ్ స్టేజ్ లావాదేవీల ద్వారా స్టార్టప్‌లకు 706 మిలియన్ డాలర్ల ఫండింగ్ లభించిందని, 166 లావాదేవీలతో ‘ఎ’ సిరీస్ ఫండింగ్ ద్వారా 1.67 బిలియన్ డాలర్లు, ‘బి’ సిరీస్ రౌండ్‌తో 2.16 బిలియన్ డాలర్లు వచ్చాయని ప్రిక్విన్ వివరించింది. ‘ఇ’ సిరీస్ రౌండ్లో 29 లావాదేవీలే 4.47 బిలియన్ డాలర్లు సమకూర్చాయన్నది. ఇతర అన్ని రౌండ్లలో 20 బిలియన్ డాలర్లకు పైగా నిధుల్ని భారత స్టార్టప్‌లు సంపాదించాయని పేర్కొంది. ఈ ఏడాది ఐపీవో ముందస్తు ఫండింగ్ రౌండ్స్‌లో స్టార్టప్‌లకు భారీ నిధులు వచ్చాయని , జొమాటో, ఓలా, పాలసీబజార్, పేటీఎం తదితర టాప్-10 లావాదేవీలతో 5.58 బిలియన్ డాలర్ల సమీకరణ జరిగినట్టు తెలిపింది.
సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడులు 3 బిలియన్ డాలర్లు…
ఈ ఏడాది పలు అంతర్జాతీయ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ భారత్‌లో జోరుగా పెట్టుబడులు చేశాయి. ఇక్కడి స్టార్టప్‌ల్లో జపానీస్ సాఫ్ట్‌బ్యాంక్ అత్యధికంగా 3 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. టైగర్ గ్లోబల్, ఫాల్కన్ ఎడ్జ్, సెక్వొయా క్యాపిటల్, యాక్సెల్, బ్లూమె వెంచర్స్ తదితర వెంచర్ ఫండ్స్ ఇక్కడ పెట్టుబడిచేసినవాటిలో ఉన్నాయి.