Mutual Funds | సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) నిధుల రాకతో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి గత నెలలో రికార్డు స్థాయిలో నిధులు వచ్చి పడ్డాయి. గత నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోకి రూ.8,637 కోట్ల నిధులు వచ్చాయి. ఇది గత మూడు నెలల్లో నికర గరిష్టం అని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఏఎంఎఫ్ఐ) సోమవారం తెలిపింది.
గత ఆర్థిక సంవత్సరం చివరిలో మార్చి నెలలో గరిష్టంగా ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ లోకి రూ.20,534 కోట్ల నిధులు వచ్చాయి. జూన్ నెల పెట్టుబడులు ఏప్రిల్ నెల కంటే రూ.6,480 కోట్లు, మే నెలలో రూ.3,240 కోట్లు ఎక్కువ. వరుసగా 28వ నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోకి నిధులు పోటెత్తాయి. గత మార్చి నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు పుంజుకోవడం కూడా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోకి నిధుల పోటెత్తడానికి కారణంగా తెలుస్తున్నది.
`ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోకి మే నెల కంటే జూన్ నెలలో అధిక పెట్టుబడులు వచ్చాయి. ఉన్నత స్థాయిలో లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇచ్చినా, ఇన్వెస్టర్లు సిప్ ప్లానింగ్‌కు అనుగుణంగా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు కొనసాగించడానికి ఇన్వెస్టర్లు ప్రాధాన్యం ఇస్తున్నారు` అని కొటక్ మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ సేల్స్, మార్కెటింగ్ అండ్ డిజిటల్ బిజినెస్ నేషనల్ హెడ్ మనీశ్ మెహతా చెప్పారు.