Rupee Record Low | ముడి చమురు, బంగారం తదితర కమొడిటీ ధరలు భారీగా పెరగడం.. దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. దీంతో ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ రికార్డు స్థాయికి పడిపోయింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో కమొడిటీస్ ధరలు పెరగడం రూపాయి మారకం విలువ పడిపోవడానికి కారణం అని విశ్లేషకులు చెబుతున్నారు. ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్‌లో సోమవారం రూపాయి విలువ 77.02లకు పతనమైంది. తద్వారా 81 పైసలు నష్టపోయింది. దేశ చరిత్రలో ఇది ఆల్‌టైం రికార్డు.
ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఉదయం రూపాయి మారకం విలువ 77.08 స్థాయికి పడిపోయింది. సోమవారం ఒక్కరోజే రూపాయి విలువ ఒక శాతం నష్టపోయింది. మున్ముందు 77.50 నుంచి 78 స్థాయికి రూపాయి విలువ పడిపోతుందని అంచనా వేస్తున్నట్లు ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ రీసెర్చ్ వైస్‌ప్రెసిడెంట్ అనూజ్ గుప్తా చెప్పారు.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతుండటంతో సోమవారం బ్యారెల్ ముడి చమురు ధర 130 డాలర్లు దాటింది. పరిస్థితులు ఇలాగే ఉంటే దేశీయ స్టాక్ మార్కెట్లో తమ స్టాక్స్‌ను విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు విక్రయించే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. ఇది కమోడిటీస్ ధరలు మరింత పెరగడానికి దారి తీస్తుందని చెబుతున్నారు.