Retail Inflation | గత నెల రిటైల్ ద్రవ్యోల్బణం దిగి వచ్చింది. ఆహార ధరలు తగ్గడంతో జూలై ద్రవ్యోల్బణం 3.54 శాతంగా నమోదైంది. కీలక వడ్డీరేట్లను తగ్గించడానికి ద్రవ్యోల్బణం ఆర్బీఐ లక్షిత స్థాయి 4-6 శాతం మధ్య ఉండాలి. వచ్చేనెలలో జరిగే ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్షలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని తెలుస్తున్నది. 2019 సెప్టెంబర్ లో రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు శాతానికి దిగువనే ఉంది. జూలై రిటైల్ ద్రవ్యోల్బణం ఐదేండ్ల కనిష్ఠ స్థాయికి చేరింది.
2023 జూలై రిటైల్ ద్రవ్యోల్బణం 7.44 శాతం. గత జూన్ లో చిల్లర ద్రవ్యోల్బణం 5.08 శాతంగా నమోదైంది. జూన్ లో 9.36 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం జూలైలో 5.42 శాతానికి దిగి వచ్చింది. ఆహార వస్తువుల ధరలే ద్రవ్యోల్బణంపై సగానికి పైగా ప్రభావం చూపుతాయి. ఇటీవల ఆర్బీఐ సైతం ఆహార ద్రవ్యోల్బణం ఆందోళనకు గురి చేస్తుందని పేర్కొన్న నేపథ్యంలో ఆహార వస్తువుల ధరలు తగ్గడం గమనార్హం. కూరగాయల ధరలు 29.32 శాతం నుంచి 6.83 శాతానికి తగ్గాయి.