Infinity E1 scooter | బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ బౌన్స్ మార్కెట్లోకి తీసుకొచ్చిన ఇన్ఫినిటీ ఈ1 ఎలక్ట్రిక్ స్కూటర్ అదరగొడ్తున్నది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం పెద్ద సంఖ్యలో బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే బుక్ చేసుకున్నవారికి స్కూటర్లను డెలివరీ ఇవ్వడం కూడా ప్రారంభమైంది. ఇప్పటివరకు దాదాపు 60,000 కంటే ఎక్కువ బుకింగ్స్ వచ్చినట్లు సమాచారం. జియోఫెన్సింగ్, డ్రాగ్ మోడ్, రివర్స్ మోడ్, క్రూయిజ్ కంట్రోల్, యాంటీ థెఫ్ట్ వంటి ఫీచర్స్ ఈ స్కూటర్ ప్రత్యేకత. బ్లూటూత్‌తో స్కూటర్‌కు కనెక్ట్ చేయగల ఇన్ఫినిటీ స్మార్ట్ అప్లికేషన్ కూడా అందుబాటులో ఉన్నది.
బౌన్స్ సంస్థ తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను బ్యాటరీతో, బ్యాటరీ లేకుండా ఆప్సన్స్‌తో 5 రంగుల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. బ్యాటరీ ఉండే స్కూటర్ ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ రూ. 68,999, కాగా బ్యాటరీ లేని స్కూటర్ ధర ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ రూ. 45,099 గా ఉన్నది. ఈ కంపెనీ గతంలో తమ వాహనాల విక్రయాలను ఆన్లైన్లోనే చేసేది. కాగా, ఇప్పుడు అన్ని ముఖ్య ప్రాంతాల్లో డీలర్లను నియమించి వ్యాపారం విస్తరణపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఢిల్లీ పితంపురాలో మొదటి ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ను ప్రారంభించింది.
36 ఆఫ్‌లైన్ స్టోర్లను నిర్వహిస్తున్న ఈ సంస్థ.. ఇప్పటికే గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రిటైల్ స్టోర్స్ ఏర్పాటుచేసింది. ఈ ఏడాది చివరికల్లా రిటైల్ స్టోర్స్ సంఖ్యను 75 కు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు బౌన్స్ కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఇలాఉండగా, కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు ఈ సంస్థ తమ వాహనాలను ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నది. ఇప్పుడు ఇన్ఫినిటీ ఈ1 స్కూటర్లను ఫ్లిప్‌కార్ట్‌లో బుక్ చేసుకుని కేవలం 15 రోజుల్లోనే పొందవచ్చు.