Chiranjeevi | తెలుగు చిత్రసీమలో మెగాస్టార్ చిరంజీవి 71వ పుట్టినరోజు సందర్భంగా పండగ వాతావరణం నెలకొంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు చిరంజీవికి సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అభిమానులు సైతం మెగాస్టార్ బర్త్‌డేను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి సినీ ప్రయాణాన్ని, ఆయన సేవా కార్యక్రమాలను గుర్తుచేసుకుంటూ ప్రశంసలు కురిపించారు.
చిరంజీవి 1978లో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారని చంద్రబాబు పేర్కొన్నారు. తన అద్భుతమైన నటన, కష్టపడే తత్వంతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుని మెగాస్టార్‌గా ఎదిగారని కొనియాడారు. ఎంతోమంది అభిమానులను సంపాదించుకోవడంతో పాటు తెలుగు సినిమా ఖ్యాతిని మరింతగా పెంచిన వ్యక్తిగా చిరంజీవిని అభివర్ణించారు. చిరంజీవి కేవలం సినీ రంగానికే పరిమితం కాకుండా సమాజ సేవలోనూ తనదైన ముద్ర వేశారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. రక్తనిధి, నేత్రనిధి వంటి సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఎంతోమందికి అండగా నిలిచారని, తద్వారా సమాజం పట్ల తన బాధ్యతను చాటుకున్నారని పేర్కొన్నారు.చిరంజీవి చేపట్టిన సేవా కార్యక్రమాలు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాయని ఆయన అభిప్రాయపడ్డారు.
చిరంజీవి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. భవిష్యత్తులోనూ తన సినిమాలతో ప్రేక్షకులను మరింతగా అలరించాలని కోరుకుంటూ మెగాస్టార్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అలానే సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తన ట్వీట్లో.. ప్రతి కొడుక్కి తన తండ్రి చిరంజీవే.. ప్రతి తండ్రికి తన కొడుకు చిరంజీవి లాగా కష్టపడాలనే ఆశ.. చిరంజీవి అనే పేరు ప్రతీ ఇంటికి సొంతమైపోయింది.. అలాగే నా ఇంటి పేరు సుప్రీమ్ హీరో అయింది.. నా చిరునామా సుప్రీమ్ హీరో.. నా సుప్రీమ్ హీరో చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చారు. ఇక వరుణ్ తేజ్, మెహర్ రమేష్, రఘురామ కృష్ణం రాజు, దగ్గుబాటి పురంధేశ్వరి,గంటా శ్రీనివాసరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,శ్రీను వైట్ల, దేవినేని అవినాష్ ఇలా పలువురు ప్రముఖులు చిరంజీవికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. మొత్తానికి చిరంజీవి 71వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకుల నుంచి కూడా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతుండటంతో సోషల్ మీడియాలో ‘మెగాస్టార్’ పేరు మారుమోగుతోంది.