The Odyssey | హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ఒడిస్సీ’ బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది. విడుదలై ఐదు వారాలు పూర్తయినప్పటికీ ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తూనే ఉంది. ముఖ్యంగా ఐమ్యాక్స్ స్క్రీన్లలో సినిమాకు ఇప్పటికీ భారీ ఆక్యుపెన్సీ నమోదవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ‘డెడ్‌పూల్ & వుల్వరైన్’ ను వెనక్కి నెట్టి అత్యధిక వసూళ్లు సాధించిన R-Rated చిత్రంగా ‘ది ఒడిస్సీ’ నిలిచింది. దీంతో నోలన్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ మరోసారి స్పష్టమైంది.
థియేటర్లలో ఇంకా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘ది ఒడిస్సీ’ డిజిటల్ రిలీజ్‌పై తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. నవంబర్ 17 నుంచి ఈ చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో రెంట్, పర్చేజ్‌కు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. అదే రోజున 4K Ultra HD Blu-ray ఫార్మాట్లో కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.అంటే థియేటర్లలో విడుదలైన దాదాపు నాలుగు నెలల తర్వాత మాత్రమే ఈ సినిమాను ఇంట్లో డిజిటల్‌గా చూసే అవకాశం ప్రేక్షకులకు లభించనుంది. సాధారణంగా భారీ హాలీవుడ్ చిత్రాలు థియేటర్లలో విడుదలైన కొన్ని వారాలకే డిజిటల్లోకి వస్తున్న నేపథ్యంలో ‘ది ఒడిస్సీ’ విషయంలో మాత్రం చాలా ఎక్కువ థియేట్రికల్ విండోను కొనసాగించడం ఆసక్తికరంగా మారింది.
‘ది ఒడిస్సీ’ విషయంలో క్రిస్టోఫర్ నోలన్ తీసుకున్న నిర్ణయాల ప్రభావం బాక్సాఫీస్ వద్ద స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా భారీ విజువల్స్, యాక్షన్ సన్నివేశాలను పెద్ద స్క్రీన్‌పై, ముఖ్యంగా ఐమ్యాక్స్ ఫార్మాట్లో చూడాలని ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. విడుదలై ఐదు వారాలు గడిచినా కొన్ని ప్రాంతాల్లో IMAX షోలు ఇప్పటికీ ప్రేక్షకులతో నిండిపోతున్నాయని సమాచారం. దీంతో డిజిటల్ రిలీజ్‌ను ఆలస్యం చేయడం ద్వారా థియేటర్లలో సినిమాకు ఉన్న డిమాండ్‌ను మరింతకాలం కొనసాగించే వ్యూహాన్ని నోలన్, యూనివర్సల్ అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. క్రిస్టోఫర్ నోలన్ గత చిత్రం ‘ఓపెన్‌హైమర్’ విషయంలోనూ ఇలాంటి వ్యూహాన్నే అనుసరించారు. ఆ చిత్రం సుమారు 123 రోజుల పాటు థియేటర్లలో ప్రదర్శితమైన తర్వాత డిజిటల్ రిలీజ్ జరుపుకున్న విషయం విదితమే.