Uppal Balu | బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభానికి ముందే సోషల్ మీడియాలో రకరకాల వివాదాలతో హాట్ టాపిక్‌గా మారుతోంది. ముఖ్యంగా కామనర్ ఎంట్రీ కోసం నిర్వహించిన ‘బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2’ ఆడిషన్స్ ప్రక్రియ తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఆడిషన్స్‌లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఉప్పల్ బాలుకు, జడ్జిగా వ్యవహరించిన నవదీప్ మధ్య జరిగిన వాగ్వాదం పెద్ద కలకలమే రేపింది. ఆడిషన్ సమయంలో తనను వల్గర్ వీడియోల పేరుతో నవదీప్ తీవ్రంగా అవమానించారంటూ ఉప్పల్ బాలు మొదట్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నవదీప్‌పై మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తూ, శాపనార్థాలు పెట్టిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి. ఉప్పల్ బాలుకు మద్దతుగా నెటిజన్లు కూడా జడ్జీల తీరును తప్పుబట్టారు.
అయితే, తాజాగా ఈ వివాదంలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. జడ్జెస్‌ను ఏకిపారేసిన ఉప్పల్ బాలు, సడన్‌గా ప్లేట్ తిప్పేసి వారి తప్పేమీ లేదంటూ మాట్లాడిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆడిషన్స్‌లో ఎలిమినేట్ అయిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. బిగ్ బాస్‌కు వెళ్లాలన్నది తన చిన్ననాటి కల అని, కోట్లాది మంది చూసే ఆ షోలో తాను కూడా కనిపించాలనే ఉద్దేశంతోనే ప్రయత్నించినట్లు తెలిపారు.
అంతేకాకుండా, “నిజం చెప్పాలంటే హౌజ్‌లో లేనందుకు చాలా బాధపడ్డాను. కానీ జడ్జెస్ చేసింది వంద శాతం న్యాయమే. జడ్జెస్ స్థానంలో కూర్చోవడం అంత ఈజీ కాదు. అక్కడ కూర్చున్న వారు టాలెంట్ ఉన్నవారే” అంటూ ఉప్పల్ బాలు అనూహ్యంగా స్టేట్మెంట్ మార్చడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఒకవైపు నవదీప్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూనే, మరోవైపు జడ్జీలను సమర్థిస్తూ మాట్లాడటంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘అసలు బాలు స్ట్రాటజీ ఏంటి?’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరొకవైపు, తనను బిగ్ బాస్ హౌజ్‌లోకి తీసుకోవాలని కోరుతూ ఆగస్ట్ 20న నాగార్జునకి, స్టార్ మా యాజమాన్యానికి ఉప్పల్ బాలు బహిరంగంగా విజ్ఞప్తి చేయడం గమనార్హం.