న్యూఢిల్లీ : రెండేండ్ల నుంచీ కొవిడ్-19 నియంత్రణలతో పడుతూ లేస్తున్న పరిశ్రమ వర్గాల్లో ఇక కరోనా నియంత్రణలు తొలగి వర్క్ ఫ్రం హోం పద్ధతికి తెరపడనుండటంతో నయా జోష్ నెలకొంటోంది. పలు స్కూళ్లు, విద్యాసంస్ధలు, కార్యాలయాలు రీఓపెన్ అవుతుండటంతో లైఫస్టైల్, దుస్తులు, ఫుట్‌వేర్ సహా పలు కంపెనీల్లో అమ్మకాలు పెరుగుతాయనే ఉత్తేజం కనిపిస్తోంది. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ఈ రంగాల్లో అమ్మకాలు ఏకంగా 40 నుంచి 60 శాతం వరకూ పడిపోయాయి.
కొవిడ్-19 తగ్గుముఖం పట్టడంతో డిమాండ్ క్రమంగా సాధారణ స్ధాయికి చేరుకుంటోందని లైఫ్‌స్టైల్ ఇంటర్నేషనల్ డిపార్ట్మెంటల్ స్టోర్ చైన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దేవరాజన్ అయ్యర్ చెప్పుకొచ్చారు. మహమ్మారి సమయంలో లీజర్, అథ్లెజర్, కాజువల్ దుస్తులకు డిమాండ్ నెలకొనగా ఇప్పుడు అన్ని రకాల దుస్తులకూ డిమాండ్ ఊపందుకుంటోందని తెలిపారు. అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్లో స్కూల్, ఫార్మల్ షూస్ సేల్స్‌లో రికవరీ నమోదైందని ఫుట్‌వేర్ కంపెనీ బాటా వెల్లడించింది.
రాబోయే క్వార్టర్లలో సేల్స్ మరింత మెరుగవుతాయని బాటా ఇండియా ఎండీ గుంజన్ షా పేర్కొన్నారు. రాబోయే క్వార్టర్లలో సేల్స్ నిలకడగా పెరుగుతాయని ఆశిస్తున్నామని చెప్పారు. మరోవైపు మార్చి నుంచి పలు కార్యాలయాలు తెరుచుకోనుండటంతో పలు రంగాల్లో అమ్మకాలు ఊపందుకోనున్నాయి. వోల్టాస్, ఐసీఐసీఐ బ్యాంక్, పార్లే, సన్ ఫార్మా, గోద్రెజ్, గోల్డ్‌మన్ శాక్స్, డాబర్, హయర్, పానాసోనిక్, బయోకాన్, డిక్సన్ టెక్నాలజీస్, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సహా పలు రంగాలకు చెందిన కంపెనీలు తమ ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించే ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.