పారిశ్రామిక రంగం డీలా పడింది. మోదీ మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు తీసుకుంటున్న చర్యలు ఉత్తవేనని తేలిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని కేంద్ర సర్కారు చెప్తున్న మాటలకు, గణాంకాలకు పొంతనలేకుండా పోయింది. మొన్నటికి మొన్న కీలక రంగాలు ఏడాది కనిష్ఠ స్థాయికి పడిపోగా..తాజాగా పారిశ్రామిక రంగం ఎనిమిది నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఏప్రిల్ నెలకుగాను పారిశ్రామిక రంగంలో వృద్ధి 2.7 శాతానికి పరిమితమైంది. తయారీ రంగంలోపాటు గనులు, విద్యుత్తు రంగాలు నిరాశాజనక పనితీరుతో ఐఐపీ డీలా పడింది.
PM Modi | నూఢిల్లీ, మే 28 : పారిశ్రామికం మళ్లీ పడకేసింది. ఆర్థిక వృద్ధిలో నాలుగో స్థానానికి చేరుకోనున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్న నరేంద్ర మోదీ సర్కార్కు పారిశ్రామిక ప్రగతి రూపంలో గట్టి షాక్ తగిలింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెలలోనే ఢీలాపడింది. రికార్డు స్థాయిలో పెరుగుతూ వచ్చిన పారిశ్రామిక ప్రగతికి బ్రేకులు పడ్డాయి. తయారీ రంగంతోపాటు గనులు, విద్యుత్ రంగాలు నిరాశాజనక పనితీరు కనబర్చడంతో ఐఐపీ ఎనిమిది నెలల కనిష్ఠ స్థాయికి జారుకున్నది. ఏప్రిల్ నెలలో కేవలం 2.7 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. క్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 5.2 శాతంతో పోలిస్తే సగానికి సగం పడిపోయింది. కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. మార్చి నెలలో నమోదైన వృద్ధిరేటును మళ్లీ సవరించింది. గతంలో 3 శాతంగా ఉంటుందని అంచనాను విడుదల చేసిన గణాంకాల శాఖ ఈసారి దీనిని 3.9 శాతానికి సవరించింది.
దేశ వృద్ధి, పారిశ్రామిక ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న తయారీ రంగంలో నిస్తేజం ఆవహించింది. గత కొన్ని నెలలుగా పరుగులు పెట్టిన తయారీ రంగం వెనుకంజవేసింది. గత నెలకుగాను ఈ రంగంలో వృద్ధి 3.4 శాతానికి పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 4.2 శాతంతో పోలిస్తే భారీగా తగ్గింది. దీంతోపాటు గనుల రంగంలో వృద్ధి ప్రతికూలానికి పడిపోయింది. దేశవ్యాప్తంగా ఉన్న గనుల్లో ఖనిజ ఉత్పత్తి గణనీయంగా పడిపోవడం, వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో గత నెలకుగాను ఈ రంగంలో వృద్ధి మైనస్ 0.2 శాతానికి పడిపోయింది. అంతక్రితం ఏడాది ఇది 6.8 శాతంగా నమోదైంది. అలాగే విద్యుత్ రంగంలో వృద్ధి ఒక్క శాతానికి పరిమితమైంది. ఏప్రిల్ 2024లో ఇది 10.2 శాతంగా ఉన్నది.
ఇతర రంగాలతో పోలిస్తే క్యాపిటల్ గూడ్స్ రంగం అంచనాలకుమించి రాణించింది. గత నెలలో ఈ రంగంలో వృద్ధి 20.3 శాతంగా నమోదైంది. ఏడాది క్రితం ఇదే నెలలో నమోదైన 2.8 శాతంతో పోలిస్తే భారీగా పెరిగింది. ఏడాది క్రితం ఇదే నెలలో 10.5 శాతం వృద్ధిని కనబరిచిన కన్జ్యూమర్ డ్యూరబుల్ విభాగం ఈసారికిగాను 6.4 శాతంతో సరిపెట్టుకున్నది. మౌలిక సదుపాయాలు, నిర్మాణ రంగాలు కూడా పడకేశాయి. ఈ రెండు విభాగాలు నాలుగు శాతం వృద్ధితో సరిపెట్టుకున్నాయి. గతేడాది వచ్చిన వృద్ధి 8.5 శాతంతో పోలిస్తే సగానికి సగం పడిపోయింది. ప్రాథమిక వస్తువులు 0.4 శాతం మాత్రమే కనబరిచాయి.
కీలక రంగాలు ఎనిమిది నెలల కనిష్ఠ స్థాయికి జారుకున్నది. ఏప్రిల్ నెలకుగాను ఎనిమిది నెలల కనిష్ఠ స్థాయికి పడిపోతూ 0.5 శాతంగా నమోదైంది. క్రూడాయిల్, సహజ వాయువు రంగాలు ప్రతికూల వృద్ధిని నమోదు చేసుకోవడం ఇందుకు కారణం. ప్రతీకార సుంకాలపై అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో గతేడాది 4.6 శాతంగా నమోదైన వృద్ధి ఈసారి తిరోగమన బాటపట్టింది.