రాజన్న సిరిసిల్ల, మార్చి 21 (నమస్తే తెలంగాణ): ఇండో, జర్మనీ సహకారంతో సిరిసిల్ల సహకార విద్యుత్తు సంస్థలో సోలార్ విద్యుత్తు ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జర్మనీ ఆహార వ్యవసాయ మంత్రిత్వశాఖ, ప్రౌన్హోఫర్ హెయిన్రిచ్ హార్ట్ ఇన్స్టిట్యూట్ జర్మనీ బృందం శుక్రవారం సిరిసిల్ల సెస్‌ను సందర్శించింది. పాలకవర్గ చైర్మన్ చిక్కాల రామారావు, అధికారులతో కలిసి సెస్ పరిధిలో విద్యుత్తు సబ్స్టేషన్లు, పెద్దూరులోని 220 కేవీని పరిశీలించారు.
అనంతరం సిరిసిల్ల సహకార విద్యుత్తు సంస్థ కార్యాలయానికి చేరుకుని పాలకవర్గంతో భేటీ అయ్యారు. జర్మనీ ప్రతినిధుల బృందం సెస్ పనితీరును ప్రశంసించింది. సెస్ పరిధిలోని వినియోగదారుల సంఖ్య, వ్యవసాయ మోటర్లు, పరిశ్రమలు, గృహావసరాలకు సంబంధించి విద్యుత్తు కనెక్షన్లు, వ్యవసాయం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా ధనం 60 శాతం, జర్మన్ డెవలప్మెంట్ బ్యాంకు సహకారంతో సోలార్ విద్యుదుత్పత్తి ప్లాంటు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు.