Indo Farm | వ్యవసాయ పరికరాల తయారీ సంస్థ ఇండో ఫామ్ ఎక్విప్మెంట్ (Indo Farm Equipment) షేర్లు మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టయ్యాయి. గత వారం ఐపీఓ ద్వారా ఇండో ఫామ్ ఎక్విప్మెంట్ దేశీయ స్టాక్ మార్కెట్లలో ఎంటరైంది. ఇష్యూ షేర్ ధర రూ.215 కాగా, మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో 20 శాతానికి పైగా విలువతో ట్రేడయింది. బీఎస్ఈలో 20.18 శాతం వృద్ధితో రూ.258.60 వద్ద ట్రేడ్ ప్రారంభమైంది. తదుపరి 33.44 శాతం వృద్ధితో షేర్ రూ.289.60 పలికింది. మరోవైపు, ఎన్ఎస్ఈలో 19 శాతం పుంజుకుని రూ.256 వద్ద ప్రారంభమైంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,355.30 కోట్ల వద్ద స్థిర పడింది.
గత వారం ముగిసిన ఇండోఫామ్ ఎక్విప్మెంట్ ఐపీఓలో ఇన్వెస్టర్లు 227.57 రెట్లు బిడ్లు దాఖలు చేశారు. గురువారం నాడు ఈ సంస్థ ఐపీఓ ముగిసింది. రూ.204-215 మధ్య ఖరారైన షేర్ ప్రైస్ బాండ్‌తో రూ.260 కోట్ల నిధుల సేకరణ లక్ష్యంతో ఇండోఫామ్ ఎక్విప్మెంట్ ఐపీఓకు వెళ్లింది. ఇందులో తాజాగా 86 లక్షల వాటాల జారీ ద్వారా, ప్రమోటర్ రణ్‌బీర్ సింగ్ ఖాండ్వాలియాకు చెందిన 35 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా విక్రయించింది. ఐపీఓ ద్వారా సేకరించిన నిధులను కంపెనీ విస్తరణకు వినియోగిస్తామని తెలిపింది ఇండోఫామ్.