Indigo | ముంబై నుంచి దోహా వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆదివారం ముంబై – దోహా విమాన సర్వీసు బయలుదేరడానికి నాలుగు గంటలకు పైగా సమయం పట్టింది. ఆదివారం ఉదయమే టేకాఫ్ కావాల్సిన ‘ఇండిగో’ విమానం లో సాంకేతిక లోపం రావడంతో మరమ్మత్తు పనులు చేపట్టారు. దీంతో ప్రయాణికులు విమానం లోపలే నాలుగు గంటలకు పైగా కూర్చుండి పోయారు. రాత్రి 8 గంటలకు ఈ విమానం టేకాఫ్ అవుతుందని ఇండిగో వర్గాలు తెలిపాయి.
పలు దఫాలు విమానం టేకాఫ్ కావడానికి చర్యలు తీసుకున్నా.. ప్రొసీజరల్ జాప్యం వల్ల చివరకు ఆగిపోవాల్సి వచ్చిందని ఇండిగో యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది. బాధిత ప్రయాణికులకు అవసరమైన సాయం అందించామని, భోజనం, స్నాక్స్ తదితర వసతులు కల్పించామని వివరించింది. ఆదివారం ఉదయం సాంకేతిక లోపంతో నాలుగు గంటలకు పైగా నిలిచిపోయిన విమానం నుంచి ప్రయాణికులను దింపేందుకు ఇమ్మిగ్రేషన్ అధికారులు అంగీకరించలేదని ఓ ప్రయాణికుడు ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశాడు.