Indigo | దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్) లిమిటెడ్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఇండిగో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.లక్ష కోట్ల మార్కును దాటేసింది. దేశీయ విమాన యాన రంగంలో ఆ ఘనత సాధించిన తొలి విమానయాన సంస్థగా నిలిచింది.
ఈ నెల 28న జరిగిన ఇంట్రాడే ట్రేడింగ్లో ఇండిగో రూ.లక్షకోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ మార్క్ దాటింది. అంతర్గత ట్రేడింగ్ లో సంస్థ షేర్ రూ.2634 పలికింది. ఫలితంగా సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.01 లక్షల కోట్లు దాటింది. ఏడాది కాలంలో 55 శాతం పుంజుకున్నది. అంతే కాదు.. ఇటీవల 500 బోయింగ్ ఏ320 ఫ్యామిలీ ఎయిర్ క్రాఫ్ట్ ల కొనుగోలుకు ఆర్డర్ పెట్టింది. ఈ విమానాలు 2030-35 మధ్య కాలంలో డెలివరీ కానున్నాయి.
దేశీయ విమానయాన మార్కెట్లో ఇండిగోకి 61 శాతం వాటా ఉంది. గత నెలలో దేశీయ విమాన సర్వీసుల రంగంలో ఇండిగో వాటా 61.4 శాతంగా ఉంటుందని డీజీసీఏ నివేదిక సారాంశం. రెండో స్థానంలో ఉన్నయ ఎయిర్ ఇండియా దేశీయంగా 9.4 శాతం వాటా మాత్రమే కలిగి ఉందని ఆ నివేదిక సారాంశం.
అంతర్జాతీయంగా 26 దేశాల్లోని 75 అంతర్జాతీయ నగరాలకు సేవలందిస్తున్నది. దేశీయంగా 300 విమానాలతో ప్రతి రోజూ 300కి పైగా విమానాలతో 1800కి పైగా విమాన సర్వీసులు నడుపుతూ 78 నగరాలను అనుసంధానిస్తున్నది.
ప్రీ-కరోనా కంటే ఇప్పుడు దేశంలో తొమ్మిది శాతం మంది ప్రయాణికులు పెరిగారు. 2013-14లో ఆరు కోట్ల మంది ప్రయాణికులు ఉంటే, ఇప్పుడది 20 కోట్లకు పెరిగింది. విమాన సర్వీసులు 400 నుంచి 700కి పెరిగాయి. గతేడాది 20 కోట్ల మంది దేశంలో విమాన ప్రయాణాలు చేశారు. 2027 నాటికి జాతీయ, అంతర్జాతీయ కేంద్రాలకు ప్రయాణం చేసిన విమాన ప్రయాణికుల సంఖ్య 40 కోట్లకు పెరుగుతుందని అంచనా. గతేడాది దేశంలో 20 కోట్ల మంది ప్రయాణించారు.
భవిష్యత్ అవసరాలను పరిగణనలోకి తీసుకుంటే ఇప్పుడు ఉన్న 700 ప్రయాణ విమానాలు సరిపోవు. మున్ముందు 3-4 ఎయిర్ లైన్స్ వచ్చే అవకాశాలున్నాయి. టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు కూడా మూడు రెట్లు పెరుగుతాయి.
గత ఎనిమిదేండ్లలో దేశంలోని విమానాశ్రయాలు 74 నుంచి 141కి పెరిగాయి. వచ్చే ఐదేండ్లలో మరో 80 విమానాశ్రయాలు జత కలుస్తాయని తెలుస్తున్నది. 2030 నాటికి విమానాశ్రయాల సంఖ్య 220కి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. సెంటర్ ఫర్ ఆసియా పసిఫిక్ ఏవియేషన్ అంచనా ప్రకారం భారతదేశంలో 4000 విమానాల్లో 130 కోట్ల మంది దేశీయ, అంతర్జాతీయ కేంద్రాలకు ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి.