IndiGo | మహీంద్రా ఎలక్ట్రికల్ ఆటోలిమిటెడ్పై ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్లైన్స్ కోర్టుకెక్కింది. మహీంద్రా కొత్త ఎలక్ట్రికల్ వెహికల్లో 6ఈ పదాన్ని ఉపయోగించడాన్ని సవాల్ చేస్తూ కేసు వేసింది. మహీంద్రా కంపెనీ ట్రేడ్మార్క్ ఉల్లంఘనకు పాల్పడిందంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ జస్టిస్ అమిత్ బన్సల్ బెంచ్ ముందుకు విచారణకు రాగా.. విచారణకు నుంచి తప్పుకున్నారు. ఈ కేసులో విచారణ డిసెంబర్ 9న జరుగనున్నది. ఈ విషయంపై చర్చించేందుకు మహీంద్రా కంపెనీ తమను సంప్రదించేందుకు ప్రయత్నించిందని ఇండిగో తరఫు న్యాయవాది సందీప్ సేథీ కోర్టుకు వెల్లడించారు. వాస్తవానికి ఇండిగో ఎయిర్లైన్స్ ‘6ఈ’ని బ్రాండింగ్ సేవలకు వాడుకుంటున్నది.
6ఈ ఫ్లెక్స్, 6ఈ ప్రైమ్, 6ఈ లింక్ పేరుతో ఎయిర్లైన్స్ సేవలు అందిస్తూ వస్తున్నది. తాజాగా మహీంద్రా ఆటో లిమిటెడ్స్ ఇటీవల కొత్తగా బీఈ 6ఈ మోడల్ కార్ని లాంచ్ చేసింది. బీఈ 6ఈతో పాటు ఎక్స్ఈవీ 9 కార్స్ని మహీంద్రా ఇటీవల ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ కొత్త కార్లు వచ్చే ఏడాది జనవరి నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. మహీంద్రా 6ఈని ఉపయోగించడంపై ఇండిగో అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రకటనలు, విమానయాన సేవలతో సహా వివిధ అవసరాల కోసం ఎయిర్లైన్స్ 2015లో 6ఈ ట్రేడ్మార్క్ని నమోదు చేసింది. మహీంద్రా ఎలక్ట్రికల్ ఇటీవల బీఈ 6ఈ ట్రేడ్మార్క్ ఆమోదం పొందింది.