Air Taxi | రెండేండ్లలో భారత్లో ఎయిర్ ట్యాక్సీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అమెరికాలోని ఆర్చర్ ఏవియేషన్, దేశీయ విమానయాన సంస్థ ఇండిగో పేరెంట్ సంస్థ ఇంటర్ గ్లోబ్ కలిసి భారత్లో ‘ఎయిర్ ట్యాక్సీ’ సేవలు ప్రారంభించనున్నాయి. ఇందుకోసం గతేడాది ఈ రెండు సంస్థల మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. ఇందుకు 200 ఎలక్ట్రిక్ వెర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ ఎయిర్ క్రాఫ్టులను పంపిణీ చేయనున్నది. 2026 నాటికి ఈ ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ ఎయిర్ ట్యాక్సీలో పైలట్ తోపాటు నలుగురు ప్రయాణం చేయొచ్చు. హెలికాప్టర్ లాగే పని చేసినా.. అతి తక్కువ శబ్దంతో ప్రయాణిస్తాయి. ఒక్కో ఎయిర్ క్రాఫ్ట్ సుమారు 100 కోట్ల డాలర్లు ఉంటది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభించాలని ఇండిగో భావిస్తున్నది. ఇందుకోసం తొలుత అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చే ఏడాదికి సర్టిఫికెట్ పొందితే, అటుపై డీజీసీఏ సర్టిఫికేషన్ ప్రక్రియ మొదలవుతుందని ఆర్చర్ ఏవియేషన్ ఫౌండర్ ఆడం గోల్డ్ స్టెయిన్ చెప్పారు.
ఉదాహరణకు ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ నుంచి హర్యానాలోని గుర్గ్రామ్కు మధ్య దూరం 27 కి.మీ. ఈ రూట్ లో కారులో ప్రయాణం చేయాలంటే 90 నిమిషాలు పడుతుంది.. కారు ప్రయాణం కోసం రూ.1500 ఖర్చవుతుంది. ఎయిర్ ట్యాక్సీలో వెళితే ఏడు నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఎయిర్ ట్యాక్సీలో వెళితే రూ.2,000-3000 ఖర్చవుతుందని ఆర్చర్ ఏవియేషన్ తెలిపింది. ఎయిర్ ట్యాక్సీలో ఉన్న ఆరు బ్యాటరీలు 30 నుంచి 40 నిమిషాల్లో పూర్తిగా చార్జింగ్ చేయొచ్చు.