న్యూఢిల్లీ, మే 14: ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు అంత సులువు కాదా?.. ఓడిపోయే వీలుందా?.. గతంతో పోల్చితే ఈసారి మోదీ సర్కారుకు మెజారిటీ బాగా తగ్గుతుందా?.. ఇండియా వీఐఎక్స్ (భారతీయ స్టాక్ మార్కెట్ల ఒడిదొడుకుల సూచీ) పెరుగుదలను చూస్తే ఇప్పుడీ ప్రశ్నలే తలెత్తుతున్నాయి. మంగళవారం 52 వారాల గరిష్ఠాన్ని తాకుతూ ఇండియా వీఐఎక్స్ 21.88కి చేరింది. ఏప్రిల్ 23న ఇది 10.20గానే ఉండటం గమనార్హం. ఇక గత నెల రోజుల్లో దాదాపు 67 శాతం పెరిగింది. దీంతో ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై మదుపరులలో నెలకొన్న అనుమానాలు, ఆందోళనలకు ఇండియా వీఐఎక్స్ అద్దం పడుతున్నదని మెజారిటీ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇండియా వీఐఎక్స్ పెరుగుదలలో మీడిల్ఈస్ట్ ఉద్రిక్తతలు, అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ వృద్ధి కూడా కీలకపాత్ర పోషిస్తుందని చెప్తున్న మార్కెట్ నిపుణులు.. గత 20 రోజులుగా మాత్రం సూచీ పెరుగుదలకు ఈసారి ఎన్నికల్లో బీజేపీకి 300లలోపు ఎంపీ సీట్లే రావచ్చన్న అంచనాలే కారణమని స్పష్టం చేస్తున్నారు. ఇదే జరిగితే దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిలోకి జారుకుంటాయని, ఒడిదొడుకులు, ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. అందుకే వీఐఎక్స్ సూచీ అంతలా పెరుగుతూపోతున్నదని అభిప్రాయపడుతున్నారు. ‘గత మూడు వారాలుగా బీజేపీ ప్రభుత్వంపట్ల ప్రజల్లో కొంత వ్యతిరేకత పెరిగినట్టు కనిపిస్తున్నది. దీన్నిబట్టి బీజేపీకి ఈ దఫా 280-300 సీట్లు వస్తాయనిపిస్తున్నది. అయితే 290 కంటే సీట్లు తగ్గితే భారతీయ స్టాక్ మార్కెట్లకు ఆ ఫలితం తప్పక ప్రతికూలమే అవుతుంది’ అని పేస్ 360 సహవ్యవస్థాపకుడు, ప్రధాన గ్లోబల్ వ్యూహకర్త అమిత్ గోయల్ అన్నారు.