ముంబై, ఫిబ్రవరి 24 : దేశీయ ఐటీ సంస్థలు అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 282.6 బిలియన్ డాలర్లు, వచ్చే ఏడాది 300 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించే అవకాశాలున్నాయని నాస్కాం అంచనావేస్తున్నది. క్రితం ఏడాది వచ్చిన ఆదాయంతో పోలిస్తే 5.1 శాతం వృద్ధిని నమోదు చేసుకోనున్నదని నాస్కాం ప్రెసిడెంట్ రాజేశ్ నంబియార్ తెలిపారు. ఐటీ సర్వీసెస్ కంపెనీలు, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ కంపెనీలు, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు, ఈ-కామర్స్ కంపెనీలు సంయుక్తంగా ఈ ఏడాది కొత్తగా 1.26 లక్షల మందికి ఉపాధి కల్పించాయన్నారు.
దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 58 లక్షలకు చేరుకున్నారు. 2024లో అంతర్జాతీయ ఐటీ కంపెనీలు నమోదు చేసుకున్న 4.7 శాతం వృద్ధితో పోలిస్తే దేశీయ ఐటీ సంస్థలు అంతకంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేసుకోనున్నట్లు పేర్కొంది. కంపెనీల ఆదాయం 4.3 శాతం ఎగబాకి 137.1 బిలియన్ డాలర్లకు చేరుకోనుండగా, బీపీఎం ఇండస్ట్రీ 4.7 శాతం వృద్ధితో 54.6 బిలియన్ డాలర్లకు, ఇంజినీరింగ్ రీసర్చ్ అండ్ డెవలప్మెంట్లో 7 శాతం వృద్ధితో 55.6 బిలియన్ డాలర్లకు చేరుకోనున్నది.