న్యూఢిల్లీ, జూన్ 23 : దేశీయ ఫార్మా రంగం.. పొరుగు దేశం ముడి సరుకుపైనే ఎక్కువగా ఆధారపడుతున్నదని నీతి ఆయోగ్ తెలియజేసింది. భారతీయ ఔషధ తయారీ సంస్థలు.. 65 శాతం క్రిటికల్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ), కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కేఎస్ఎమ్) తదితరాలను చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాయని మంగళవారం తెలిపింది. దేశంలో పర్యావరణ నిబంధనల్ని పాటించాల్సిన అవసరాలు పెరుగుతున్నకొద్దీ ఉత్పాదక, పరిశోధన-అభివృద్ధి వ్యయాలు కూడా ఔషధ తయారీ రంగంలో బాగా పెరుగుతున్నాయని తమ ‘ట్రేడ్ వాచ్ క్వార్టర్లీ’ 8వ ఎడిషన్లో నీతి ఆయోగ్ పేర్కొన్నది.
ఔషధాల ఉత్పత్తికి అవసరమైన ప్రధాన ముడి సరుకు దేశంలో తయారు కాకపోవడానికి ముఖ్య కారణం.. ఇక్కడయ్యే అధిక ఖర్చులేనన్న అభిప్రాయాలు ఇండస్ట్రీ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. దేశీయంగా తయారయ్యే ముడి సరుకు కంటే సులువుగా, చౌకగా చైనాలో లభిస్తుండటంతో దిగుమతులపైనే మెజారిటీ కంపెనీలు ఆధారపడుతున్నాయంటున్నారు. ఫార్మా ఇండస్ట్రీ కార్యకలాపాలు.. భూ, వాయు, జల కాలుష్యాలకు దారితీస్తుండటం కూడా ఇతర దేశాల నుంచి ముడి సరుకు దిగుమతుల్ని పెంచుతున్నదని ఈ రంగ విశ్లేషకుల మాట. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే లోపభూయిష్టమైన విధానాలు సైతం ఔషధ రంగాభివృద్ధిని అడ్డుకుంటున్నాయని చెప్తున్నారు.
నెమ్మదించిన ఆవిష్కరణలు, వాటికి వాణిజ్యపరమైన దన్ను లభించకపోవడం.. దేశంలో ఆవిష్కర్తలకు, దీర్ఘకాలిక పెట్టుబడులకు అనిశ్చిత పరిస్థితుల్ని తెచ్చిపెడుతున్నదని నీతి ఆయోగ్ తాజా నివేదిక చెప్పడం గమనార్హం. కాగా, హై-వాల్యూ ఫార్మాస్యూటికల్ సెగ్మెంట్లలో వైవిధ్యాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నదన్నది. అంతేగాక రెగ్యులేటరీ విధానాల్లో పారదర్శకత, మెరుగైన విద్యా వ్యవస్థ, బలమైన పరిశ్రమ.. లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో సాంకేతిక పరివర్తనకు దోహదం చేయగలవని సూచించింది. అప్పుడే పరిశోధన సహకారం, స్టార్టప్ ఇంక్యుబేషన్కు మార్గం సుగమం కాగలదన్నది. ఔషధ రంగంలో పరిమాణంపరంగా బాగానే ఉన్న భారత్.. విలువపరంగానూ పెరుగాల్సిన అవసరం ఉన్నదని తాజా నివేదిక విడుదల సందర్భంగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అశోక్ కుమార్ లహ్రీ వ్యాఖ్యానించారు.