న్యూఢిల్లీ, జనవరి 10: గడిచిన నాలుగేండ్లలో రష్యా నుంచి భారత్ కొన్న ముడి చమురు విలువ రూ.15.12 లక్షల కోట్లు (168 బిలియన్ డాలర్లు)గా ఉన్నది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలైన విషయం తెలిసిందే. అప్పట్నుంచి ఇప్పటిదాకా రష్యా నుంచి భారత్ కొన్న క్రూడాయిల్ వివరాలను ఫిన్లాండ్కు చెందిన సెంటర్ ఫర్ రిసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఆర్ఈఏ) తాజాగా వెల్లడించింది. చైనా తర్వాత రష్యా నుంచి అత్యధికంగా క్రూడాయిల్‌ను కొంటున్నది భారతేనని తెలిపింది. అయితే ఇటీవలికాలంలో రష్యా నుంచి భారత్ ఈ దిగుమతులను తగ్గిస్తూ వస్తున్నది.
గత ఏడాది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆ దేశంలోకి దిగుమతయ్యే భారతీయ వస్తూత్పత్తులపై 50 శాతం సుంకాలను విధించిన విషయం తెలిసిందే. ఇందులో తమ మాట వినకుండా రష్యా నుంచి ముడి చమురును కొంటున్నందుకుగాను వేసిన 25 శాతం సుంకాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఏకంగా 500 శాతం సుంకాలను వేసేందుకు ట్రంప్ సర్కారు సిద్ధమవుతున్నది. దీంతో రష్యా-భారత్ లావాదేవీలు ఇప్పుడు అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయి.