న్యూఢిల్లీ, జూన్ 14: గత కొన్ని నెలలుగా రెండంకెల స్థాయిలో వృద్ధిని కనబరిచిన దేశీయ ఎగుమతులు మళ్లీ నీరసించాయి. గత నెలకుగాను దేశీయ ఎగుమతులు 9.1 శాతం వృద్ధితో 38.13 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఇదే నెలలో దిగుమతులు 7.7 శాతం అధికమై 61.91 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దీంతో వాణిజ్యలోటు(ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం) ఏడు నెలల గరిష్ఠ స్థాయి 23.78 బిలియన్ డాలర్ల వద్ద ముగిసింది. అక్టోబర్ 2023లో నమోదైన 31.46 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు తర్వాత ఇదే గరిష్ఠ స్థాయి కావడం విశేషం. ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్, ప్లాస్టిక్ రంగాలు ఆశాజనక పనితీరు కనబర్చడం వల్లనే ఎగుమతుల్లో ఈ మాత్రమైన వృద్ధిని సాధించాయి.
ఆభరణాల ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. మే నెలలో జెమ్స్ అండ్ జ్యూవెల్లరీ ఎగుమతులు 4.95 శాతం తగ్గి రూ.20,713.37 కోట్లకు పరిమితమైనట్లు జెమ్ అండ్ జ్యూవెల్లరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(జీజేఈపీసీ) వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే నెలలో రూ.21,795.65 కోట్లు(2,646.92 మిలియన్ డాలర్లు) విలువైన ఆభరణాలు ఎగుమతయ్యాయి. కానీ, బంగారు ఆభరణాల ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 13 శాతం ఎగబాకి రూ. 5,507.71 కోట్లకు చేరుకోగా, వెండి ఆభరణాల ఎగుమతులు కూడా రెండింతలు పెరిగి రూ.665 కోట్ల నుంచి రూ.1,103.72 కోట్లకు చేరాయని వెల్లడించింది.
ఎగుమతులు గత నెలలో ఆశాజనక పనితీరు కనబరిచాయి. మిగతా నెలల్లో కూడా ఇదే ట్రెండ్‌ను కొనసాగించే అవకాశాలున్నాయి. వాణిజ్యలోటు కలవరపెడుతున్నప్పటికీ ప్రపంచ దేశాల్లో అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్నది భారతే కావడంతో భవిష్యత్తులో దేశీయంగా డిమాండ్ పెరిగే అవకాశాలున్నాయి. లోటు పెరిగిందని కలవరపడాల్సిన అవసరం లేదు.
– సునీల్ బర్థాల్, వాణిజ్య శాఖ కార్యదర్శి