ముంబై, ఫిబ్రవరి 15: ఎర్ర సముద్రంలో రవాణా సంక్షోభానికి తోడు అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు నెలకొన్నప్పటికీ, జనవరి నెలలో భారత్ ఎగుమతులు 3.12 శాతం పెరిగాయి. మూడు నెలల గరిష్ఠస్థాయి 36.92 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో ఎగుమతులు- దిగుమతుల మధ్య వ్యత్యాసమైన వాణిజ్యలోటు తొమ్మిది నెలల కనిష్ఠస్థాయి 17.49 బిలియన్ డాలర్లకు తగ్గినట్టు గురువారం కేంద్ర వాణిజ్యశాఖ విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2023 ఏప్రిల్‌లో నమోదైన 15.24 బిలియన్ డాలర్ల లోటు తర్వాత ఇదే కనిష్ఠం.
2024 జనవరి నెలలో దిగుమతులు 3 శాతం పెరిగి 54.41 బిలియన్ డాలర్లకు చేరాయి. తాజా గణాంకాలపై వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ భర్తావాల్ మీడియాతో మాట్లాడుతూ ధనిక దేశాల ఆర్థిక వ్యవస్థల మందకొడితనం, ఎర్ర సముద్రం సంక్షోభం, కమోడిటీ ధరల తగ్గుదల తదితర అంశాల నడుమ కూడా జనవరి నెలలో భారత్ ఎగుమతులు పెరిగాయన్నారు. ఎర్ర సముద్రంలో రవాణా నిలిచిపోయిన నేపథ్యంలో ఎగుమతిదారులు, సంబంధిత మంత్రిత్వ శాఖలు, ఇతర భాగస్వామ్య పక్షాలతో మూడు దఫాలు తాను సమావేశమయ్యానని తెలిపారు. ఎగుమతిదారులకు గరిష్ఠంగా రుణాలివ్వాలని, ఈ సమయంలో రుణ చెల్లింపుల్ని పొడిగించాలని తాము బ్యాంక్‌లను సూచించామన్నారు.. అలాగే ఎగుమతి ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్లను పెంచవద్దని ఎగ్జిమ్ బ్యాంక్, ఈసీజీసీలను కోరామని భర్తావాల్ చెప్పారు.
ఈ ఏడాది జనవరి నెలలో క్రూడాయిల్ దిగుమతులు 4.33 శాతం పెరిగి 16.56 బిలియన్ డాలర్లకు చేరాయి. బంగారం దిగుమతులు భారీగా 174 శాతం వృద్ధిచెంది 1.9 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జనవరి మధ్యకాలంలో మాత్రం ఎగుమతులు 4.89 శాతం క్షీణించి 353.92 బిలియన్ డాలర్లకు తగ్గగా, దిగుమతులు సైతం 6.71 శాతం తగ్గి 561.12 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ పది నెలల్లో వాణిజ్యలోటు 207.2 బిలియన్ డాలర్లకు దిగింది. క్రూడ్ దిగుమతులు 15.91 శాతం క్షీణించి 146.75 బిలియన్ డాలర్లకు చేరగా, బంగారం దిగుమతులు జోరుగా 301.7 శాతం వృద్ధిచెంది 38 బిలియన్ డాలర్లకు పెరిగాయి.