GST Collections | గత నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.68 లక్షల కోట్లు జరిగాయి. 2023తో పోలిస్తే 12.5 శాతం ఎక్కువ. ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలకు ఇది నిదర్శనం అని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. దేశీయ లావాదేవీల్లో జీఎస్టీ వసూళ్లు 13.9శాతం పెరిగితే, విదేశీ దిగుమతుల ద్వారా 8.5 శాతం పుంజుకున్నాయని కేంద్ర ఆర్థికశాఖ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. 2023 ఫిబ్రవరిలో రూ.1.51 లక్షల కోట్లు వసూళ్లయ్యాయి. ఇది 13.6 శాతం ఎక్కువ.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2023 ఏప్రిల్ నుంచి 2024 ఫిబ్రవరి వరకూ స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.18.40 లక్షల కోట్లు జరిగాయి. 2022-23తో పోలిస్తే 11.7 శాతం ఎక్కువ. 2022-23 ఫిబ్రవరిలో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.1.67 లక్షల కోట్లు జరిగాయి. 2021-22తో పోలిస్తే రూ.1.5 లక్షల కోట్లు ఎక్కువ. 2023-24లో నికర జీఎస్టీ వసూళ్లు రూ.16.36 లక్షల కోట్లు కాగా, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 13 శాతం ఎక్కువ అని అధికారిక ప్రకటనలో తెలిపారు. మొత్తం జీఎస్టీ వసూళ్లలో రూ.73,641 కోట్లు, రాష్ట్రాలకు రూ.75,569 కోట్లు పంపిణీ చేస్తారు.
ఫిబ్రవరిలో జీఎస్టీ వసూళ్ల వివరాలివీ..
సెంట్రల్ జీఎస్టీ – రూ.31,785 కోట్లు.
రాష్ట్ర జీఎస్టీ – రూ.39,615 కోట్లు
ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ- రూ.84,098 కోట్లు (రూ. 38,593 కోట్ల దిగుమతి సుంకంతో కలిపి)
సెస్ – రూ.984 కోట్ల దిగుమతి సుంకంతో కలిపి రూ.12,839 కోట్లు.