Gold Imports | బంగారం అంటే భారతీయ మహిళలకు ఎంతో ఇష్టం. పండుగలు, శుభకార్యాల్లో ధరించడానికి.. వీలైతే పిసరంత కొనుగోలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తారు. ఇటీవలి కాలంలో బంగారం పెట్టుబడి ఆప్షన్‌గా కూడా మారింది. దేశీయ అవసరాలకు దాదాపుగా విదేశాల నుంచి పూర్తిగా బంగారం దిగుమతి చేసుకోవాల్సిందే. కానీ, గత ఆర్థిక సంవత్సరం 2022-23లో ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య బంగారం దిగుమతులు భారీగా తగ్గాయి. 2021-22తో పోలిస్తే గతేడాది 30 శాతం దిగుమతి తగ్గి.. 31.8బిలియన్ డాలర్లకు పడిపోయాయి. బంగారం దిగుమతులపై కేంద్రం భారీగా కస్టమ్స్ డ్యూటీ వసూలు చేయడంతోపాటు ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం, అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం ముప్పు భయాలు, వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లు పెంచడం కూడా కారణమని కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించింది.
బంగారంతో పోలిస్తే వెండి దిగుమతులు మాత్రం గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 66 శాతం పెరిగి 530 కోట్ల డాలర్లకు చేరాయి. ఇదిలా ఉంటే బంగారం దిగుమతులు గణనీయంగా పడిపోయినా వాణిజ్య లోటు మాత్రం తగ్గక పోవడం ఆసక్తికర పరిణామం. 2021-22 ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య వాణిజ్య లోటు 172.53 బిలియన్ డాలర్లు ఉంటే.. గత ఆర్థిక సంవత్సరంలో 247.52 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.
ప్రపంచ దేశాల్లో బంగారం ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. ఆభరణాల తయారీకి గల డిమాండ్ వల్లే విదేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. ప్రతి యేటా భారత్ సరాసరి 800- 900 టన్నుల పుత్తడి దిగుమతి చేసుకుంటున్నది. 2022-23 ఏప్రిల్- జనవరి మధ్య సుమారు 600 టన్నుల బంగారం దిగుమతి చేసుకున్నదని కమా జ్యువెలరీ ఎండీ, జీజేఈపీసీ మాజీ చైర్మన్ కొలిన్ షా తెలిపారు.
మరోవైపు గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 0.3 శాతం పడిపోయి 35.2 బిలియన్ డాలర్లకు పరిమితం అయ్యాయి. కరంట్ ఖాతా లోటు (సీఏడీ) తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం బంగారం దిగుమతులను నిరుత్సాహ పర్చాలని భావించింది. అందుకే బంగారంపై దిగుమతుల సుంకం 10.75 నుంచి 15శాతానికి పెంచేసింది.