ముంబై, జూన్ 5: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2026-27)గాను దేశ జీడీపీ వృద్ధిని 6.6 శాతంగానే అంచనా వేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ). 3 రోజుల ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష శుక్రవారం ముగిసిన అనంతరం తీసుకున్న నిర్ణయాలు, వేసిన అంచనాలను గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ సమీక్షలో దేశ ఆర్థిక వృద్ధికి సంబంధించి చేసిన 6.9 శాతం లెక్కను సవరించింది. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్ని ఎగదోస్తున్న విషయం తెలిసిందే. దేశీయ ఇంధన అవసరాలు దాదాపు 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్న నేపథ్యంలో భారత్‌కు ఆ సెగ గట్టిగానే తగులుతున్నది. ఇప్పటికే పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలు పెరుగగా.. రవాణా ఖర్చుల భారంతో అన్ని వస్తూత్పత్తుల రేట్లూ ఎగిసిపడుతున్నాయి. ఈ క్రమంలోనే వీటి ప్రభావం దేశ ఆర్థిక వృద్ధిపై పడుతుందని ఆర్బీఐ అంటున్నది. అందుకే ఈసారి జీడీపీ అంచనాలకు కోత పెట్టింది. మొత్తంగా మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు పెరుగుతున్నకొద్దీ.. భారతీయ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావమూ ఎక్కువవుతుందని హెచ్చరించింది. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్లలో ఒడిదుడుకులు, వర్షాభావ పరిస్థితులతో ఈ ఆర్థిక సంవత్సరం.. ఆర్థిక ప్రగతికి అవకాశాలు అంతంతమాత్రంగానే ఉండొచ్చన్న ఆందోళనల్ని కనబర్చింది.
రెపోరేటు 5.25 శాతంగానే..
ద్రవ్య సమీక్ష సందర్భంగా రెపోరేటును 5.25 శాతం వద్దే యథాతథంగా ఉంచాలని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)లోని సభ్యులంతా ఏకగ్రీవంగా తీర్మానించారు. దీంతో ఇప్పటికైతే గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీరేట్లు ఎక్కడివక్కడే ఉండనున్నాయి. దాంతో రుణగ్రహీతలకు ఊరట దక్కింది. లేనిపక్షంలో ఈఎంఐలు భారంగా మారేవి. నిజానికి ఊహించినట్టుగానే ఆర్బీఐ ఈసారి వడ్డీరేట్ల జోలికి వెళ్లలేదు. ద్రవ్యోల్బణం ముప్పు పొంచి ఉన్నప్పటికీ.. ఆర్థిక వృద్ధికే సెంట్రల్ బ్యాంక్ అధిక ప్రాధాన్యతనిచ్చింది.
ద్రవ్యోల్బణం విజృంభణే..
గల్ఫ్ యుద్ధం.. దేశ జీడీపీ అంచనాల్ని తగ్గిస్తే, ద్రవ్యోల్బణం అంచనాల్ని పెంచింది. ఈ ఏడాది ఏప్రిల్‌తో మొదలైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.1 శాతంగా నమోదు కావచ్చని ఆర్బీఐ పేర్కొన్నది. ఇంతకుముందు 4.6 శాతంగానే ఉండొచ్చన్న అంచనాలున్నాయి. అయితే పెరుగుతున్న పెట్రో ధరలు, ఆ ప్రభావంతో కూరగాయలు, కిరాణా సరుకులు, ఇతరత్రా అన్ని వస్తూత్పత్తులకు పెరిగే రేట్ల దృష్ట్యా ద్రవ్యోల్బణం అంచనా మరో అర శాతం పెంచక తప్పలేదు ఆర్బీఐకి. మే 15 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు రూ.8 పెరిగిన సంగతి విదితమే. మరోవైపు ఎల్‌నినో ప్రభావంతో ఈసారి వర్షాలు తక్కువేనన్న వాతావరణ శాఖ అంచనాలూ గుబులు పుట్టిస్తున్నాయి. దేశీయ వ్యవసాయం ఎక్కువగా వర్షాధారమైనదే కావడంతో పంట దిగుబడులు తగ్గితే ఆహార ద్రవ్యోల్బణం పరుగులు పెట్టడం ఖాయమే. ఇప్పటికే రిటైల్, హోల్‌సేల్ ద్రవ్యోల్బణాల్లో పెరుగుదల మొదలైంది చూస్తూనే ఉన్నాం.
ఇదిలావుంటే రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యం 4 శాతంగానే ఉందని ఆర్బీఐ స్పష్టం చేసింది. తాజా ద్రవ్య సమీక్షలో ద్రవ్యోల్బణం విజృంభిస్తున్నప్పటికీ.. వృద్ధికి ఊతమిచ్చేలా కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడంతో వచ్చిన అనుమానాలపై గవర్నర్ మల్హోత్రా స్పష్టతనిచ్చారు. రాబోయే ద్రవ్య సమీక్షల్లో వడ్డీరేట్లు.. ధరల స్థిరీకరణే ధ్యేయంగా ఉంటాయంటూ పరోక్షంగా వడ్డింపులకు సంకేతాలిచ్చారు. ఇక ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 4.2 శాతంగా, జూలై-సెప్టెంబర్‌లో 5.1 శాతంగా, అక్టోబర్-డిసెంబర్లో 5.9 శాతంగా, జనవరి-మార్చిలో 5.4 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది.
చలామణిలోకి ప్లాస్టిక్ నోట్లు?
త్వరలో చలామణిలోకి ప్లాస్టిక్ నోట్లు రాబోతున్నాయి. ఈ మేరకున్న ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని ఆర్బీఐ తెలిపింది. అయితే దీనిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని ద్రవ్య సమీక్ష అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గవర్నర్ మల్హోత్రా స్పష్టం చేశారు. పాలీమర్ కరెన్సీతో ఉన్న లాభాలు, నష్టాలను బేరీజు వేస్తున్నామని చెప్పారు. వాటిని చలామణిలోకి తెస్తే ఎటువంటి పరిస్థితుల్ని చూడాల్సి వస్తుందన్నదాన్నీ పరిశీలిస్తున్నామన్నారు. నిజానికి 2014 ఫిబ్రవరిలోనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వంద కోట్ల రూపాయల విలువైన రూ.10 ప్లాస్టిక్ నోట్లను కొచ్చి, మైసూర్, జైపూర్, సిమ్లా, భువనేశ్వర్లలో చలామణిలోకి తేవాలనుకుంటున్నట్టు ప్రకటించింది. ప్రస్తుత కాగితపు నోట్లతో పోల్చితే పాలీమర్ కరెన్సీ త్వరగా పాడైపోకుండా, చిరిగిపోకుండా ఎక్కువకాలం మన్నికగా ఉంటుందని వివరించింది. అయితే వివిధ కారణాలతో ఆ పైలట్ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు.
మల్హోత్రా మాటల్లో..
ఎఫ్సీఎన్ఆర్ (బీ) డిపాజిట్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, విదేశీ రుణాలు, ఈక్విటీ పెట్టుబడుల ద్వారా విదేశీ పెట్టుబడులను ఆకట్టుకోవడానికి చేపట్టిన చర్యలు స్వాగతించదగినవి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరమైనవి కూడా. ప్రభుత్వం, ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలతో దేశంలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరుగగలదు. బాండ్ మార్కెట్లను, రూపాయిని కూడా బలోపేతం చేయగలవు.
-సీఎస్ శెట్టి, ఎస్బీఐ చైర్మన్
ద్రవ్యోల్బణం అంచనాల దృష్ట్యా రాబోయే నెలల్లో వడ్డీరేట్ల పెంపు ఉంటుందని స్పష్టమవుతున్నది.
– మదన్ సబ్నవీజ్, బీవోబీ ప్రధాన ఆర్థికవేత్త
వడ్డీరేట్లను మార్చకుండా వ్యాపారాలకు, ఆర్థిక వృద్ధికి ఆర్బీఐ ఊతమిచ్చింది.
– సన్యాల్, అసోచామ్ ప్రధాన కార్యదర్శి
ఆర్బీఐ ద్రవ్య సమీక్ష నిర్ణయాలను స్వాగతిస్తున్నాం. గృహ రుణాలపై వడ్డీరేట్లు స్థిరంగా ఉంటే హౌసింగ్ డిమాండ్ నిలకడగా ఉంటుంది.
– నిర్మాణ రంగ సంఘాలు క్రెడాయ్, నరెడ్కో
ఎఫ్ఐఐలకు ఎల్టీసీజీ రద్దు
ఓవైపు కరెన్సీ మార్కెట్లో డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఆల్‌టైమ్ కనిష్ఠాలకు పడిపోతున్నది. ఇంకోవైపు పెరుగుతున్న దిగుమతుల విలువతో దేశంలో ఫారెక్స్ రిజర్వులు నానాటికీ క్షీణిస్తున్నాయి. మరోవైపు యుద్ధ భయాలు, అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల నడుమ భారతీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్లు తమ పెట్టుబడులను వేగంగా వెనుకకు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రూపీపై ఒత్తిడిని తగ్గించాలని, డాలర్లను మరింతగా పోగేయాలని అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఆర్బీఐ శుక్రవారం పలు నిర్ణయాలు, చర్యలను చేపట్టాయి. ఇందులో భాగంగానే మోదీ సర్కార్.. ప్రభుత్వ సెక్యూరిటీల్లో విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) పెట్టే పెట్టుబడులపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్టీసీజీ)ను ఎత్తేసింది.
ఈ మేరకు ఓ ఆర్డినెన్స్‌ను కూడా జారీ చేసింది. కాగా, ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్లు 27.6 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్న నేపథ్యంలో కేంద్రం నిర్ణయం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. ఇక ఇందుకు తగ్గట్టుగానే ఆర్బీఐ సైతం విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి విదేశీ మదుపర్ల కోసం కొన్ని ప్రభుత్వ బాండ్ల పరిధిని విస్తరించింది. పూర్తిగా అందుబాటులో ఉండే మార్గం (ఎఫ్ఏఆర్) కింద ప్రభుత్వ బాండ్ల కోసం.. 15, 30, 40 ఏండ్ల కాలపరిమితితో కొత్త సర్కారీ బాండ్లను ప్రకటించింది. అంతేగాక జనరల్ రూట్ ద్వారా విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్ల (ఎఫ్‌పీఐ) పెట్టుబడుల కోసం వ్యక్తిగత సెక్యూరిటీలు, ఏకాగ్రత, స్వల్పకాలిక పెట్టుబడులకు సంబంధించి ఉన్న పరిమితుల్ని తొలగించింది. అలాగే భారతీయ పౌరసత్వం ఉండి విదేశాల్లో ఉంటున్నవారు (ఎన్నారైలు), విదేశాల్లోనే స్థిరపడ్డ భారతీయ మూలాలున్నవారి (ఓసీఐలు) కోసం లిస్టెడ్ ఈక్విటీ సాధనాల్లో సెబీ ఆమోదం లేకుండానే పెట్టుబడుల్ని పెంచుకొనే వెసులుబాటును కల్పించింది.