Forex Reserves | విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) నిల్వలు వరుసగా ఐదోవారం పెరిగాయి. మార్చి 22 తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 642.63 బిలియన్ డాలర్లకు పెరిగాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 22తో ముగిసిన వారంలో ఫారెక్స్ రిజర్వ్ నిల్వల్లో 140 మిలియన్ డాలర్లు పెరిగాయి. మార్చి 15తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 6.4 బిలియన్ డాలర్లు పుంజుకుని 642.49 బిలియన్ డాలర్లకు చేరాయి.
ఫారిన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్సీఏ) 123 మిలియన్ డాలర్లు తగ్గి 568.26 బిలియన్ డాలర్లకు చేరాయి. బంగారం రిజర్వ్ నిల్వలు 347 మిలియన్ డాలర్లు పెరిగి 51.49 బిలియన్ డాలర్లకు పెరిగాయి. మరోవైపు ఎస్డీఆర్స్ 57 మిలియన్ డాలర్లు తగ్గి 18.22 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఐఎంఎఫ్లోనూ ఫారెక్స్ నిల్వలు 27 మిలియన్ డాలర్లు తగ్గి 4.66 బిలియన్ డాలర్లకు చేరాయి. 2021 అక్టోబర్‌లో ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 645 బిలియన్ డాలర్లతో ఆల్ టైం గరిష్ట స్థాయిని తాకాయి. నాటి నుంచి డాలర్‌పై రూపాయి మారకం విలువ, అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలతో ఫారెక్స్ రిజర్వు నిల్వలు తగ్గుతూ వచ్చాయి.