న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21 : అయోధ్య రామమందిర విరాళాల చోరీకి సంబంధించి కొత్త విషయాలు వెలుగుచూశాయి. ఇప్పటివరకు మందిరంలో 70 సార్లు చోరీ జరిగినట్టు అధికారులు చెబుతూ వచ్చారు. అయితే 70 సార్లు కాదు 105 సార్లు చోరీ జరిగిందని నిర్ధారణ అయ్యింది. సాక్షాత్తూ అధికారులే ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు నివేదించారు. విరాళాల చోరీపై దర్యాప్తు జరిపిన ప్రత్యేక దర్యాప్తు బృందం పూర్తి నివేదికను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సోమవారం సర్వోన్నత న్యాయస్థానానికి అందజేశారు. సిట్ దర్యాప్తు ఇంచుమించు పూర్తయిందని, సీసీటీవీ ఫుటేజ్‌లను విశ్లేషించిన తర్వాత నిందితులను గుర్తించిందని, ఈనెల 25 లోగా చార్జిషీట్ దాఖలు చేస్తామని తెలిపారు. కానుకలు, విలువైన వస్తువులకు సంబంధించిన రసీదులు కంప్యూటర్ ద్వారా జారీ అవుతాయని, వాటిని ఎస్బీఐ లాకర్లలో భద్రపర్చినట్టు తెలిపారు. విరాళాల చోరీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, సాక్షుల ప్రకటనలు, ఇతర ఆధారాల గురించి ఆయన న్యాయస్థానానికి వివరించారు. ఈ వివరాలన్నీ న్యాయస్థానం నమోదు చేసుకుంది. సెషన్స్ జడ్జి చేతుల్లోంచి విచారణను తీసుకోవాలని తాము అనుకోవడం లేదని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. చార్జిషీట్ ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలని మేజిస్ట్రేట్‌ను ఆదేశించింది. దీనిపై మరింత దర్యాప్తు అవసరమైతే దానికి తగిన ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది. కాగా, సిట్ ఇచ్చిన నివేదిక కాపీ కావాలని పిటిషనర్లు చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది.
విరాళాల చోరీపై ఈ ఏడాది జూన్ 23న సిట్ తన ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఆ నివేదిక ప్రకారం ఏప్రిల్ 27 నుంచి జూన్ 5 మధ్య 70కి పైగా చోరీ ఘటనలు సీసీటీవీల్లో నమోదయ్యాయి. ఫుటేజిలో కరెన్సీ నోట్ల కట్టలను తమ జేబుల్లో, షూలల్లో దాచిన 8 మంది నిందితులను అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మొదటి సిట్ రద్దయ్యి రెండో సిట్ ఏర్పాటై జరిపిన సమగ్ర దర్యాప్తులో మరిన్ని చోరీ ఘటనలు వెలుగుచూశాయి.
అయోధ్య విరాళాల చోరీ కేసు నిందితులు బెయిల్‌పై విడుదలవుతారని ప్రచారం జరుగుతున్నది. నిబంధనల ప్రకారం నిందితులను అరెస్ట్ చేసిన 90 రోజుల్లో వారిపై చార్జిషీట్ నమోదు చేయాలి. అలా చేయకపోతే నిందితులు చట్టబద్ధమైన లేదా డిఫాల్ట్ బెయిల్‌కు అర్హులవుతారు. అయోధ్య కేసులో నిందితుల 90 రోజుల నిర్బంధం ఈ నెల 22తో ముగుస్తుంది. అయితే ఆ లోగా వారిపై చార్జిషీట్ దాఖలు కాకపోతే వారిని బెయిల్‌పై విడుదల చేయాల్సిందేనని న్యాయనిపుణులు అంటున్నారు.
అయోధ్య విరాళాల చోరీకి సంబంధించి పోలీసులు, దర్యాప్తు అధికారులు పక్కా ఆధారాలు సేకరించారు. ముఖ్యంగా నిందితుల ఇళ్ల నుంచి నగదు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆలయ ప్రాంగణం సీసీ టీవీ ఫుటేజ్‌ను నిశితంగా విశ్లేషించారు. విరాళాల లెక్కింపునకు సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించారు. పలువురు ఉద్యోగులు, అధికారుల స్టేట్మెంట్లు నమోదు చేశారు.