సిటీబ్యూరో, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : నగరంలోని పాఠశాలల్లో విద్యార్థుల ఆధార్ అప్డేషన్ ప్రక్రియ జరుగుతున్నది. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆధార్ బృందాలు పాఠశాలలను సందర్శించి అక్కడే అప్డేట్ చేయనున్నారు. ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించారు. మండలాల వారీగా స్కూళ్లలో విద్యార్థుల ఆధార్ అప్డేషన్ పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్టు అధికారులు తెలిపారు.
అప్డేషన్ కోసం విద్యార్థి ఆధార్, తల్లిదండ్రుల ఆధార్ కార్డుల జిరాక్స్లు తీసుకురావాల్సి ఉంటుందని చెప్పారు. విద్యార్థుల వివరాలను నమోదు చేయడంలో భాగంగా వారి ఆధార్ ప్రక్రియను చేపట్టినట్టు పేర్కొన్నారు. ఆయా స్కూళ్లకు కేటాయించిన షెడ్యూల్ల్లో విద్యార్థులంతా వినియోగించుకునేలా చూడాలని సూచించారు.