Forex Reserves | విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) నిల్వలు రోజురోజుకు అడుగంటి పోతున్నాయి. ఈ నెల 18తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు రెండు నెలల కనిష్ట స్థాయికి పతనం అయ్యాయని ఆర్బీఐ శుక్రవారం వెల్లడించింది. గత ఆరు నెలల్లో ఫారెక్స్ నిల్వలు భారీగా తగ్గిపోవడం ఇదే మొదటిసారి. ఆగస్టు 18 నాటికి ముగిసిన వారంతో ఫారెక్స్ నిల్వలు 7.28 బిలియన్ డాలర్లు తగ్గి 594.90 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అంతకుముందు 11వ తేదీతో ముగిసిన వారానికి 708 మిలియన్ డాలర్లు పుంజుకుని 602.161 బిలియన్ డాలర్ల వద్ద స్థిరపడ్డాయి.
ఈ నెల 18తో ముగిసిన వారానికి విదేశీ కరెన్సీ నిల్వలు 6,613 మిలియన్ డాలర్లు తగ్గిపోయి సుమారు 527.786 బిలియన్ డాలర్లకు చేరాయి. బంగారం నిల్వలు సైతం 515 మిలియన్ డాలర్లు తగ్గి 43.824 బిలియన్ డాలర్ల వద్ద స్థిర పడ్డాయి. ఎస్డీఆర్స్ 119 మిలియన్ డాలర్లు పతనమై 18.205 బిలియన్ డాలర్ల వద్ద ముగిశాయని ఆర్బీఐ తెలిపింది. ఐఎంఎఫ్‌లో సైతం భారత్ ఫారెక్స్ నిల్వలు 51 మిలియన్ డాలర్లు తగ్గిపోయి 50.72 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.
2021 అక్టోబర్‌లో ఫారెక్స్ నిల్వలు 645 బిలియన్ డాలర్లకు చేరుకుని ఆల్ టైం రికార్డు నెలకొల్పాయి. నాటి నుంచి ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్ పై రూపాయి మారకం విలువ పతనం, అంతర్జాతీయ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఫారెక్స్ నిల్వలు నిరంతరం తగ్గుతూ వచ్చాయి.