Forex Reserves | ఫారెక్స్ రిజర్వ్ (Forex Reserves) నిల్వలు మరోమారు తగ్గుముఖం పట్టాయి. ఈ నెల 15తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 17.7 బిలియన్ డాలర్లు పతనమై 657.89 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల ఎనిమిదో తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు తగ్గి 675.65 బిలియన్ డాలర్లకు చేరాయి.
ఈ నెల 15తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వల్లో ప్రధానమైన ఫారిన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్సీఏఎస్) 15.5 బిలియన్ డాలర్లు క్షీణించి 569.84 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. బంగారం రిజర్వు నిల్వలు 2 బిలియన్ డాలర్లు తగ్గి 65.7 బిలియన్ డాలర్ల వద్ద ముగిశాయి. ఇక స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్ఎస్) 94 మిలియన్ డాలర్లు పతనమై 18 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)లో భారత్ ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 51 మిలియన్ డాలర్లు క్షీణించి 4.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.