Forex Reserve | భారతీయ విదేశీ మారక ద్రవ్యం (Forex Reserve) నిల్వలు తగ్గుముఖం పట్టాయి. ఈ నెల ఆరో తేదీతో ముగిసిన వారానికి భారత్ ఫారెక్స్ రిజర్వు నిల్వలు 3.235 బిలియన్ డాలర్లు తగ్గి 654.857 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. పలు వారాలుగా వరుస పతనం తర్వాత గత నెల 29తో ముగిసిన వారానికి 1.51 బిలియన్ డాలర్లు వృద్ధి చెందిన ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 658.091 బిలియన్ డాలర్లకు చేరాయి. సెప్టెంబర్ నెలాఖరులో 704.885 బిలియన్ డాలర్లకు ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు చేరుకున్నాయని ఆర్బీఐ తెలిపింది.
ఈ నెల ఆరో తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వల్లో కీలకమైన ఫారిన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్సీఏస్) 3.228 బిలియన్ డాలర్లు తగ్గి 656.623 బిలియన్ డాలర్లకు చేరాయి. బంగారం రిజర్వు నిల్వలు 43 మిలియన్ డాలర్లు పతనమై 66.936 బిలియన్ డాలర్లకు చేరాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్స్) 25 మిలియన్ డాలర్లు పతనమై 18.031 బిలియన్ డాలర్ల వద్ద స్థిర పడ్డాయి. ఇక అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)లో భారత్ ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు మాత్రం 12 మిలియన్ డాలర్లు వృద్ధితో 4.266 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ తెలిపింది.