Forex Reserves | గత రెండు నెలల్లో ఫారెక్స్ రిజర్వు (Forex Reserves) 48 బిలియన్ డాలర్లు తగ్గుముఖం పట్టాయని ఆర్బీఐ తెలిపింది. సెప్టెంబర్ 27 నుంచి నుంచి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు పతనం అయ్యాయన్నది. అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ పతనం కాకుండా నివారించడానికి బహిరంగ మార్కెట్లో జోక్యం చేసుకున్నట్లు వెల్లడించింది. సెప్టెంబర్ 27తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 705 బిలియన్ డాలర్ల జీవిత కాల గరిష్టానికి చేరుకున్నాయి. ప్రస్తుతం వరుసగా ఎనిమిదో వారం ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు పడిపోతున్నాయని ఆర్బీఐ వివరించింది.
నవంబర్ 22తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 1.31 బిలియన్ డాలర్లు పతనమై 656.58 బిలియన్ డాలర్లకు చేరాయి. ఫారెక్స్ రిజర్వ్ నిల్వల్లో ప్రధానమైన ఫారిన్ కరెన్సీ అసెట్స్ 3.043 బిలియన్ డాలర్లు పడిపోయి 566.791 బిలియన్ డాలర్ల వద్ద స్థిర పడ్డాయి. బంగారం రిజర్వ్ నిల్వలు 1.828 బిలియన్ డాలర్లు పెరిగి 67.573 బిలియన్ డాలర్ల వద్ద ముగిశాయి. మరోవైపు స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్ఎస్) 79 మిలియన్ డాలర్లు పతనమై 17.985 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)లో భారత్ రిజర్వ్ నిల్వలు 15 మిలియన్ డాలర్లు తగ్గి 4.232 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.