Forex Reserves | వరుసగా మూడో వారం భారత్ ఫారెక్స్ నిల్వలు పతనం అయ్యాయి. ఈ నెల 18తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు 2.16 బిలియన్ డాలర్లు పడిపోయి 688.26 బిలియన్ డాలర్లకు చేరాయని శుక్రవారం ఆర్బీఐ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. దీంతో మూడు వారాల్లో ఫారెక్స్ రిజర్వు నిల్వలు మొత్తం 16.61 బిలియన్ల డాలర్లు పడిపోయాయి.
ఫారెక్స్ రిజర్వు నిల్వల్లో కీలకమైన ఫారిన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్సీఏస్) 3.75 బిలియన్ల డాలర్లు పడిపోయి 598.26 బిలియన్ డాలర్ల వద్ద స్థిర పడ్డాయి. బంగారం రిజర్వు మాత్రం 1.78 బిలియన్ డాలర్లు పుంజుకుని 67.4 బిలియన్ డాలర్లకు చేరాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్ఎస్) 68 మిలియన్ డాలర్లు పతనమై 18.271 బిలియన్ డాలర్ల వద్ద ముగిశాయి. ఐఎంఎఫ్ లో భారత్ ఫారెక్స్ రిజర్వు నిల్వలు 16 మిలియన్ డాలర్లు తగ్గి 4.3 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి.
గత మూడు వారాల్లో ఈ నెల 18తో ముగిసిన వారంలోనే అతి తక్కువగా ఫారెక్స్ రిజర్వు నిల్వలు పతనం అయ్యాయి. ఈ నెల 11తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిల్వల కిట్టి 10.746 బిలియన్ డాలర్లు, ఈ నెల నాలుగో తేదీతో ముగిసిన వారానికి 3.709 బిలియన్ డాలర్లు పతనం అయ్యాయి.