హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ ఎగుమతులకు శీతల గిడ్డంగులు బూస్టప్నిస్తాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ అందించిన ఘనత హైదరాబాద్ నగరానికే దక్కుతుందన్న ఆయన… ఏటా ఇక్కడి నుంచి 4 బిలియన్ డాలర్ల ఫార్మా, వ్యాక్సిన్ ఉత్పత్తులు ఎక్స్పోర్ట్ అవుతున్నాయని తెలిపారు. ఇది సమర్థవంతమైన కోల్డ్ చైయిన్ ఎకో సిస్టంతోనే సాధ్యమవుతున్నదని చెప్పారు. బుధవారం తెలంగాణ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీవోఈ) ఫర్ సస్టెయినబుల్ కూలింగ్, కోల్డ్ చైయిన్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఆహార, ఆరోగ్య భద్రత, రైతుల సాధికారత, ఎగుమతుల వృద్ధి కోసం దీన్ని అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం (తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్), బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ సస్టెయినబుల్ కూలింగ్ (సీఎస్సీ), ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్ఈపీ), జీఎమ్మార్ గ్రూప్‌ల ఉమ్మడి నిర్ణయమే ఈ సీవోఈ. ఇందుకోసం గత ఏడాది బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఓ ఎంవోయూ కూడా జరిగిన విషయం తెలిసిందే.
జీఎమ్మార్ ఇన్నోవెక్స్ క్యాంపస్‌లో..
శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోగల జీఎమ్మార్ ఇన్నోవెక్స్ క్యాంపస్ వద్ద ఈ సీవోఈ మొదలైంది. ఫార్మా, వ్యాక్సిన్, ఫుడ్, ఆహార పంటల ఎగుమతుల వృద్ధికి ఈ సెంటర్ దోహదపడగలదని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో ఈ తరహా సీవోఈ ఇదే మొదటిదని చెప్పారు. కోల్డ్ చైయిన్ ఏకో సిస్టం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడంలో సీవోఈ ముఖ్య భూమికను పోషిస్తుందన్న విశ్వాసాన్ని కనబర్చారు. నిజానికి ఆధునిక కోల్డ్ చైయిన్ టెక్నాలజీ సాయంతో అంతర్జాతీయ స్థాయికి ఉత్పత్తులను పెంచేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. ఈ క్రమంలోనే వ్యాపార, పారిశ్రామిక రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్‌లో కూలింగ్, కోల్డ్ చైయిన్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన బర్మింగ్‌హామ్ వర్సిటీకి అభినందనలు తెలిపారు.
రైతులకు దన్ను
ఈ సీవోఈతో వ్యవసాయ అనుబంధ రంగాలు అభివృద్ధి చెంది రైతుల జీవన ప్రమాణాలు మరింతగా మెరుగుపడుతాయని మంత్రి కేటీఆర్ అన్నారు. కోల్డ్ స్టోరేజీల కొరతతో రైతులు నష్టపోతున్నారని, గిట్టుబాటు ధర లభించేదాక పండించిన పంటలను నిల్వ చేసుకోలేకపోతున్నారన్నారు. అయితే ఈ సీవోఈ.. వ్యవసాయ రంగానికి అవసరమైన సౌలతులను సమకూర్చుతుందన్నారు. అలాగే నైపుణ్యాభివృద్ధి, అగ్రి-బిజినెస్, అగ్రి స్టార్టప్స్, ఆంత్రప్రెన్యూర్షిప్ను పెంచడానికీ కృషి జరుగుతుందన్నారు. ఈ కోల్డ్ చైయిన్ రంగంలో ఆధునిక టెక్నాలజీ, ఆవిష్కరణ, పరిశోధనలను ప్రోత్సహించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ భాగస్వామిగా వ్యవహరించనుందని వివరించారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. సస్టెయినబుల్ కూలింగ్ విధానాలతో ఆహార, ఆరోగ్య భద్రత మెరుగుపడుతుందని, ఎగుమతులు పెరుగుతాయన్నారు. రెన్యూవబుల్ ఎనర్జీ, ఆధునిక టెక్నాలజీని అందించడంలో సీవోఈ ప్రధాన పాత్ర వహించగలదని బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ సీఎస్సీ డైరెక్టర్ ప్రొఫెసర్ టాబీ పీటర్స్ అన్నారు.