న్యూఢిల్లీ, అక్టోబర్ 21: కీలక రంగాలు మళ్లీ నేలచూపులు చూశాయి. గత నెలకుగాను కేవలం 3 శాతం మాత్రమే వృద్ధిని కనబరించింది. ఆగస్టు నెలలో నమోదైన 6.5 శాతంతో పోలిస్తే సగానికి సగం పడిపోగా, కానీ, క్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 2.4 శాతంతో పోలిస్వే స్వల్పంగా పెరిగింది. దీంతో కీలక రంగాలు మూడు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయినట్టు అయిందని కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.
బొగ్గు, క్రూడాయిల్, రిఫైనరీ, గ్యాస్ రంగాల్లో వృద్ధి ప్రతికూలానికి పడిపోవడం వల్లనే కీలక రంగాలు అమాంతం జారుకున్నాయని తెలిపింది. గత నెలలో బొగ్గు రంగంలో ఉత్పత్తి మైనస్ 1.2 శాతానికి పడిపోగా, క్రూడాయిల్ మైనస్ 1.3 శాతం, రిఫైనరీ ఉత్పత్తులు మైనస్ 3.7 శాతం, సహజ వాయువు మైనస్ 3.8 శాతం చొప్పున పడిపోయాయి
. సహజ వాయువు ఉత్పత్తి గత ఏడాదిన్నరగా నేల చూపు చూస్తునేవున్నదని నివేదిక వెల్లడించింది. కానీ, స్టీల్‌కు డిమాండ్ అధికంగా ఉండటం కొంతలో కొంత ఊరటనిచ్చింది. ఎరువులు 1.6 శాతం, సిమెంట్ 5.3 శాతం, ఎలక్ట్రిసిటీ 2.1 శాతం చొప్పున ఆశాజనక పనితీరు కనబరిచాయి. అలాగే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలానికిగాను ఎనిమిది కీలక రంగాల్లో వృద్ధి 2.9 శాతానికి పరిమితమైంది. అంతక్రితం ఏడాది 4.3 శాతంగా నమోదైంది. దేశీయ పారిశ్రామిక ప్రగతిలో కీలక రంగాల వాటా 40 శాతానికి పైగా ఉన్నది.